*

*కోవూరు కాలువపై రూ.1.80 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన*

*– 25-30 ఏళ్ల క్రితం కూలిపోయిన బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషకరం*
*– కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారి ప్రత్యేక చొరవతోనే వంతెనల నిధులు మంజూరు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు*
*– బుచ్చిరెడ్డిపాళెం - జొన్నవాడ మధ్య 5 కిలోమీటర్ల ప్రయాణ దూరం* 

కోవూరు కాలువపై దశాబ్దాలుగా కూలిపోయి మిగిలిపోయిన రెండు కీలక వంతెనల నిర్మాణ పనులకు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆదివారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా దామరమడుగు, కాళాయకాగల్లు పంచాయతీల పరిధిలో రూ.1.80 కోట్ల ఎఫ్‌డీఆర్ (FDR) నిధులతో ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో భారీ మెజారిటీ అందించిన ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు.

*దశాబ్దాల కల నెరవేరుస్తున్నాం*
దామరమడుగు పంచాయతీ పరిధిలో 2000 సంవత్సరంలో కూలిపోయిన బ్రిడ్జిని, కాళాయకాగల్లు పంచాయతీ పరిధిలో బెజవాడ గోపాల్‌రెడ్డి గారి కాలంలో నిర్మించి దాదాపు 30 ఏళ్ల క్రితం పడిపోయిన బ్రిడ్జిని పునర్నిర్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఇన్నేళ్ల పాటు ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. ఈ రెండు బ్రిడ్జిల మంజూరు కోసం ప్రభుత్వం వద్దకు రెండుసార్లు ప్రతిపాదనలు తీసుకెళ్లామని, జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు ప్రత్యేక చొరవ చూపించి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

*రూ.1.80 కోట్లతో రెండు వంతెనల నిర్మాణం* 
దామరమడుగు పంచాయతీ వద్ద రూ.90 లక్షలతో నిర్మించే బ్రిడ్జి వల్ల పాటూరు, గుమ్మలదిబ్బ, ఎల్లాయపాళెం, కోవూరు, దామరమడుగు గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం పెరగడమే కాకుండా, రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకోవచ్చని తెలిపారు. అలాగే కాళాయకాగల్లు పంచాయతీ పరిధిలో రూ.90 లక్షలతో చేపట్టే మరో బ్రిడ్జి వల్ల సుమారు 400 ఎకరాల ఆయకట్టు రైతులకు, పెనుబల్లి, జొన్నవాడు, మినగల్లు, పంచేడు, సాల్మానుపురం గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయన్నారు.

ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాళెం నుంచి జొన్నవాడకు మినగల్లు మీదుగా వెళ్తున్నారని, ఈ వంతెన పూర్తయితే కాగులపాడు మీదుగా ప్రయాణించే మార్గం అందుబాటులోకి వచ్చి దాదాపు 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇప్పటివరకు కోవూరు నియోజకవర్గంలో రూ.850 కోట్ల అభివృద్ధి పనులు చేసుకోగలిగామని తెలిపారు. అంతేకాకుండా సెప్టెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే 'పల్లె పండుగ 3.0' కింద మరో రూ.10 కోట్లు కోవూరుకు మంజూరయ్యాయని, వాటి పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

*నాణ్యతా ప్రమాణాలు పాటించాలి*
వంతెనల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అలాగే స్థానికులు కోరిన డ్రెయిన్లు, ఇతర సమస్యల పరిష్కారానికి ఇప్పటికే రూ.35 లక్షలు బదిలీ చేశామని, త్వరలోనే డ్రెయిన్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్పష్టం చేశారు.

*