నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నామినేషన్..
పోలంరెడ్డికి మద్దతుగా జెడ్పీ కార్యాలయానికి వచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
నెల్లూరు జిల్లా, రవి కిరణాలు : నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీలో పలువురు నాయకుల పేర్లు చర్చకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు కంభం విజయరామిరెడ్డి పేరు కూడా వినిపించింది. గురువారం వంటేరు వేణుగోపాల్ రెడ్డికి పార్టీ బీఫామ్ ఇచ్చినట్లు ప్రచారం జరగడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ వర్గాల్లో నెలకొన్న చర్చల మధ్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయంగా నామినేషన్ కేంద్రానికి రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పోలంరెడ్డి అభ్యర్థిత్వం ఖరారులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సంప్రదింపుల అనంతరం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ వివరాలపై అధికారిక ధృవీకరణ అందుబాటులో లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపికలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
