స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

వైసీపీ జెండా ఎగరేయాలి

పల్లె పండుగ కాదు.. కూటమి దండగ: కాకాణి



పొదలకూరు,రవి కిరణాలు : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని విరువూరు గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 14 గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు తాను, పూజితమ్మ గ్రామాల్లో అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రతి గ్రామంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలని కోరారు.

పార్టీ కష్టకాలంలో తన వెంట నడిచిన కార్యకర్తలను ఎప్పటికీ మరువబోనని కాకాణి అన్నారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే ఎన్నికల సమయంలో వాటిని పక్కనపెట్టి అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను గుర్తుంచుకుని వారికి అండగా ఉంటానని తెలిపారు.

గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఎన్నికల బహిష్కరణకు పాల్పడిందని కాకాణి విమర్శించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కొత్త రాజకీయ డ్రామాకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రజల్లో నిలబడి పోరాడుతోందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు కార్యాచరణ ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కాకాణి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విరువూరు మాజీ సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఇంద్రసేనగౌడ్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.