గుంటూరుజిల్లాలో విజిలెన్స్ దాడులు 45 .88 లక్షల విలువైన మిరప విత్తనాల అమ్మకాలు నిలిపివేత
గుంటూరుజిల్లాలో విజిలెన్స్ దాడులు 45 .88 లక్షల విలువైన మిరప విత్తనాల అమ్మకాలు నిలిపివేత
గుంటూరు ప్రతినిధి: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడటంలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు, గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి డి. సూర్య శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, కుర్నూతల గ్రామంలోని కర్షక్ క్రాప్ సైన్సెస్
ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో నిర్వహించిన తనిఖీ లలో పలు లోపాలు గుర్తించారు.
ఈ తనిఖీలలో స్టాక్ రిజిస్టర్, ప్రాసెసింగ్ సీడ్ రిజిస్టర్ వంటి తప్పనిసరి రికార్డులు నిర్వహించకపోవడం, అలాగే విత్తనాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు మరియు సోర్స్ సర్టిఫికెట్లు లేకపోవడం గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిభందనలకు విరుద్ధంగా పలు రకాల మిర్చి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న విషయం గుర్తించారు. సూపర్-10 , రెడ్ లైన్ ఇంకా కొన్ని రకాల మిరప మరియు రెమినెంట్ విత్తనాలపై అమ్మకాలు నిలిపివేస్తూ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు దాదాపు రూ.45,88,515/- లక్షల విలువైన 11,677.5కిలోల మిర్చి విత్తనాలు ప్యాకింగ్, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధించారు.ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్, విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మీ మాధవి,వట్టిచెరుకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి సి హెచ్ సునీత పాల్గొన్నారు.
ఈ కంపెనీలో 2024 లో కూడా విజిలెన్స్ తనికీల్లో పలు లోపాలు గుర్తించారు అయినప్పటికీ ఆ సంస్థ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటం , ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేయటం గమనార్హం , అసలు ఆ కంపెనీ లైసెన్స్ లోనే మాయాజాలం ఉందని మార్కెట్లో గుసగుసలు వినిపిస్తుండటం చర్చనీయాంశం గా మారింది.