లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
ప్రమాదంలో నుజ్జయిన బస్సు ముందు భాగం
 
 గుడ్లూరు, న్యూస్‌టుడే: ముందు వెళుతున్న గ్రానైట్ లారీని వెనుక నుంచి 
కావేరీ ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో చోదకులు సత్యబాబు, చిరంజీవి, 
క్లీనర్ సునీల్, ప్రయాణికుడు మహమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు.
 
 ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెట్టు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై 
చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. కావేరి ట్రావెల్స్ 
బస్సు 32 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్ పేట 
వెళుతోంది. ఆరు గంటల సమయంలో తెట్టు రైల్వే రహదారి వద్దకు వచ్చే సరికి ముందు
 వెళుతున్న గ్రానైట్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా 
బస్సులోని వారంతా ఉలిక్కిపడ్డారు. నిద్రమత్తులో ఉన్నవారు సీట్ల నుంచి జారి 
కిందపడిపోయారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 
కావలి ఆసుపత్రికి తరలించారు. గుడ్లూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని 
పరిశీలించారు.