నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, పరిపాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను ఖండిస్తూ జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో ఆంధ్రుల రాజధాని అమరావతి పరిరక్షణ కోసం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగరంలోని స్థానిక ఐఎమ్‌ఏ హాల్ (మాగుంట లే అవుట్) నందు శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, లెక్చరర్స్,వాణిజ్య సంఘాల నేతలు, కళాకారులు, బార్, వాకర్స్ ,బులియన్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ నేతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో పాటు పలువురు మేధావులు, సామాజికవేత్త లు పాల్గొని మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ, భవిష్యత్తులో ఆంధ్రులు ఎదుర్కోబోయే దుష్పరిణామాలను తమదైన శైలిలో వినిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కృషితో, అమరావతి రైతుల త్యాగాలతో రాజధాని ప్రారంభం అయింది.ఆరు నెలల వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్ర అభివృద్ధి స్తంభించిపోయింది.జిఎన్‌ రావు కమిటీ రిపోర్టు అస్తవ్యస్తంగా ఉంది, అదొక తలతిక్క రిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలకొకటి చొప్పున 3 కోర్టుల ఏర్పాటు చేస్తామన్న జగన్ నిర్ణయం హాస్యాస్పదం. దేశంలో 732 జిల్లాలకు 25 కోర్టులు, 15 బెంచీలు మాత్రమే  ఉన్నాయి. అంటే జగన్ ఉద్దేశ ప్రకారం దేశంలో 175 హైకోర్టులు పెట్టాలా? అమరావతి రాజధాని అభివృద్ధి మొదలయి, కేంద్రం నిధులు విడుదల చేశాక కూడా జిఎన్‌ రావు కమిటీ ఎలా వేస్తారు? అమరావతి అభివృద్ధి తో చంద్రబాబు నాయుడుకి పేరు ప్రఖ్యాతులు దక్కుతుందన్న అసూయ తోనే మూడు రాజధానుల పేరిట జగన్ నాటకం ఆడుతున్నారు.జగన్ తలక్రిందులుగా తపస్సు చేసినా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతించదు.మూడు రాజధానులను కేబినెట్ లో ఆమోదించక ముందే విశాఖను రాజధానిగా విజయసాయి రెడ్డి ప్రకటించే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. తదనంతరం బీదా రవిచంద్ర మాట్లాడుతూ మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న నిర్ణయాలు తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయి.
 అమరావతి చారిత్రాత్మక రాజధాని, బౌద్ధుల పుణ్య క్షేత్రంగా, శాతవాహనుల రాజధానిగా కీర్తి ప్రతిష్టలు అమరావతి సొంతం. చంద్రబాబు నాయుడు పై ద్వేషంతో రాజధాని అమరావతి అభివృద్ధిని వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. 1956 - 2019వరకు రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రులు ఎవరూ సీమ లో కనీసం తాగునీటి సమస్యను పరిష్కరించ లేకపోయారు. పులివెందులకు సైతం నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. కమిటీల నిర్ణయాల మేరకు రాజధానులు, హైకోర్టులు మార్చడం ఎక్కడైనా చూశామా ! జిఎన్‌ రావు కమిటీ రాష్ట్ర ప్రజలలో గందరగోళాన్ని, రాజధాని రైతులలో భయాందోళనలను సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల ప్రజల ఏకైక నినాదం
ఆంధ్రుల రాజధాని అమరావతి కావాల ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఆంధ్రుల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ నగర టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సీపీఐ రామరాజు, ఎస్సీ సెల్ నాయకులు జెన్ని. రమణయ్య, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్, కప్పిర.శ్రీనివాసులు, టిఎన్‌ఎస్‌ఎప్‌ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు,లాయర్ నన్నే సాహెబ్, కృష్ణా యాదవ్, అమ్రుల్లా, గురు ప్రసాద్, కంచి మల్లికార్జున్ రెడ్డి, ఏవైవిఎస్‌ అంజయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ మస్తాన్, లీలామోహన్, అంబేద్కర్ స్టూడెంట్స్ నేత అర్జున్ బాలకృష్ణ, రసూల్, హజరత్, సాయి కిషోర్, వాసిరెడ్డి చంద్రనాగ్ తదితరులు రాజధాని అమరావతి అంశంపై తమ అభిప్రాయాలను, రాజధాని మార్పుతో జరగబోయే నష్టాలను వివరించారు.