చాలీ చాలని జీతాలతో కార్మికుల కడుపులు కొట్టద్దు
చాలీ చాలని జీతాలతో కార్మికుల కడుపులు కొట్టద్దు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించిన యూనియన్ నాయకులు
మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చూస్తాను అని హామీ
నెల్లూరు [కల్చరల్], రవికిరణాలు జూలై 18 :
గత 6 రోజుల నుండి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు శుక్రవారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి కెవిఆర్ పెట్రోల్ బంక్ వద్దనున్న రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించి యూనియన్ నాయకులు కార్మికులు సమస్యలు వివరించారు. సానుకూలంగా స్పందించిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అని తెలిపారు.
ఈ సందర్బంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే.పెంచల నరసయ్యలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత ఆరు రోజుల నుండి విధులు బహిష్కరించి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. నిరంతరం చెత్తాచెదారం మలినాలు మలమూత్రాలను శుభ్రపరుస్తూ కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని అన్నారు. పరిశుద్ధ కార్మికులు బలహీన వర్గాలకు చెందిన దళితులు గిరిజనులుగా ఉన్నారని అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం బలహీన వర్గాల కార్మికుల కడుపులు కొట్టడం సరైన చర్యకాదని విమర్శించారు. చాలీచాలని జీతాలతో ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులలో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలో 4వ స్థానం సాధించిందని ఇది కార్మికుల శ్రమతోనే సాధ్యమైందని అన్నారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కరించమని విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే వారి గురించి ఆలోచించకుండా మొండిగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు అడుగుతున్నారని వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతు కచ్చితంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రితో, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి. సూర్యనారాయణ, సిఐటియు రూరల్ నాయకులు సుధాకర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.