విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి 


జులై, 21 : నెల్లూరు జిల్లా లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. స్థానిక రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి తో కలిసి జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ కు సంబందించిన బ్రోచర్ ను శ్రీనాధరెడ్డి విడుదల చేసారు.  ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని 6 వేల  మందికి శిక్షణ అందియించడం జరిగిందని, 5 వేల మందికి జర్నలిజం పై ముద్రించిన పుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు.  చాలా మంది విలేఖరులు పీడీఎఫ్ రూపంలో ఉన్న పుస్తకాలను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు.  మారుతున్న కాలానికనుగుణంగా ప్రెస్ అకాడమీ తన కార్యక్రమాలను మార్పు చేసుకుంటున్నదన్నారు.  విలేకరులకు ఏ రకమైన శిక్షణ అవసరమో తెలుసుకుని, తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నామన్నారు.   గ్రామీణ విలేఖరులకు జర్నలిజం పై ప్రాధమిక అవగాహనకు, జర్నలిజం పై ఆసక్తి ఉన్న వారికి అనుకూలంగా ఉండే విధంగా జర్నలిజం లో   సర్టిఫికెట్ కోర్స్ ను నెల్లూరు లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నామన్నారు.  జర్నలిజం కోర్స్ నడిపే యూనివర్సిటీ కళాశాలల్లో సంవత్సరం పాటు  కాలం వెచ్చించడం , హాజరు, అధిక  ఫీజు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, యూజీసీ  గైడ్ లైన్స్ కు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్స్ రూపొందించడం జరిగిందన్నారు.  ప్రస్తుత కరోనా పరిస్థితులలో క్లాసులకు వెళ్లడం కష్టతరం కావున ఆన్లైన్ క్లాస్ ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ కోర్స్ లో మొత్తం 4 పేపర్ లు ఉంటాయని, జర్నలిజం లో రచన నైపుణ్యం, రిపోర్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎడిటింగ్ , కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, యు ట్యూబ్ , ఇన్స్టాగ్రామ్ అంశాలతో న్యూ మీడియా పేరుతో 4వ పేపర్ ఉంటాయన్నారు. ఒక్కొక్క పేపర్ కి 20 గంటలు, మొత్తం కోర్స్ కి 80 గంటలపాటు శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని వివిధ  యూనివర్సిటీలలో జర్నలిజం బోధించే  ప్రొఫెసర్లు, జర్నలిజం లో అనుభవం, మంచి పేరున్న జర్నలిస్ట్ లతో క్లాసులు నివహించడం జరుగుతుందన్నారు.   స్టడీ మెటీరియల్ కూడా సరఫరా చేస్తామన్నారు.  వివిధ వార్తా సంస్థలలో ఇంటీరియం శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.  ఉతీర్ణులైనవారికి  వివిధ మీడియా సంస్థలలో ఉపాధికి కూడా సహకరిస్తామన్నారు.  ఈ కోర్స్ 3 నెలల పాటు ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాలలో   పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ లకు  1500 రూపాయలు, డిగ్రీ చదివి వర్కింగ్ జర్నలిస్ట్స్ కానివారికి కూడా అవకాశం ఉందని వారికీ 3000 రూపాయల కోర్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందన్నారు.  గ్రామీణ ప్రాంత విలేఖరులు, జర్నలిజం పై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనాధ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. 

              నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.వి.  కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఆచార్యుల కమిటీ ఈ కోర్స్ సిలబస్ రూపొందించిందన్నారు.


ఈ కోర్స్ సర్టిఫికెట్ కు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కోర్స్ కు దరఖాస్తు చేసేందుకు  వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, జర్నలిస్ట్ కానివారు  డిగ్రీ ఉతీర్ణులై ఉండాలన్నారు.  20 క్లాసులు పూర్తి అయ్యాక అసైన్మెంట్ లు రాయవలసి ఉంటుందని, 30 మార్కులు చొప్పున ఉంటాయని, తుది పరీక్షలకు ఒక్కొక్క సబ్జెక్టు కు 70 మార్కులు ఉంటాయన్నారు.  దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని, దరఖాస్తుకు చివరి తేదీ  ఆగష్టు 20వ తేదీచెప్పారు అని కృష్ణారెడ్డి  చెప్పారు. ప్రెస్ అకాడమీ కార్యదర్శి కె.బి.జి. తిలక్, ప్రభృతులు పాల్గొన్నారు.