ఏకచత్రాధిపత్యం… వ్యవస్థలన్నింటికీ ఓ ప్రమాదకరమైన ముప్పు


వ్యవస్థ ఏదయినా సరే…

వ్యాపారం అయితే వ్యాపారం, రవాణా అయితే రవాణా, 

సేవలు అయితే సేవలు

ఎక్కడైనా ఏకచత్రాధిపత్యం పెరిగితే ప్రజలకు రాబోయేది ఇబ్బందులు, నిర్లక్ష్యమే, చివరకు నష్టమే.

దీనికి దేశం మొత్తం ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం.

గత రెండు రోజులుగా ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన అస్తవ్యస్త పరిస్థితులు ప్రయాణికులనే గాక, మొత్తం విమానయాన వ్యవస్థను కలవరపరచాయి.

ఒక్కసారిగా భారీ ఎత్తున విమానాల రద్దులు, గంటలకొద్దీ ఆలస్యాలు… ఏ విమానం ఎప్పుడు బయలు దేరుతుందో ఏ అధికారులు చెప్పలేకపోయే పరిస్థితి…

ఎయిర్‌పోర్టుల లో వేలాది మంది ప్రయాణికులు పిల్లలతో, సామానులతో, అనిశ్చితిలో అల్లాడుతూ కనిపించిన దృశ్యం.

సేవల క్షీణతకు ప్రత్యక్ష ఉదాహరణ.

దేశీయ విమానయాన రంగంలో ఇండిగో ఒక పెద్ద శాతం మార్కెట్‌ను ఒంటరిగా తన చేతిలో ఉంచుకున్న విషయం తెలిసిందే.

ఈ ఆధిపత్యం కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయం కోసం ఎక్కువ అవకాశాలు లేకపోవడం మరింత విపరీత పరిస్థితి. సంస్థ సౌకర్యాలు క్షీణించినా, షెడ్యూళ్లు మారినా, టికెట్ ధరలు పెరిగినా...

మార్కెట్ లో పోటీ లేని కారణంగా నిర్లక్ష్యం, చెదరగొట్ట లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రయాణికులు తప్పకుండా ఇబ్బందులు పడుతున్నారు.

ఏకచత్రాధిపత్యం ఎక్కడైనా ప్రజలను బాధిస్తుంది.

ఒకే సంస్థ చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవుతుంటే, సేవల నాణ్యత పడిపోవడం సహజం. బాధ్యత కన్నా లావాదేవీ బలం ముందుకు రావడం, సమయపాలన మందగించడం, వినియోగదారుల ఆందోళనలపై స్పందన తగ్గిపోవడం.

ఏకచత్రాధిపత్యం సాధారణ దుష్పరిణామాలు.

ఇండిగో ప్రస్తుత పరిస్థితి ఈ సత్యాన్ని మరోసారి బలంగా రుజువు చేసింది.

ప్రశ్న ఒక్కటే

ఇది ఇండిగోకే పరిమితమా? కాదు....

ఏ సేవా రంగంలో అయినా పోటీ తగ్గితే, వ్యాపార సంస్థలు, ఎన్నికలు లేకుండా అధికారంలో కూర్చున్న రాజకీయ నాయకులైనా ఒకే శక్తిగా పెరిగితే...

ఈ గందరగోళం, ఈ నిర్లక్ష్యం, ఈ అన్యాయం తప్పదు.

ప్రయాణికుల స్వరాలు వినిపించాలి.

నియంత్రణ సంస్థలు మేలుకోవాలి.

సేవా రంగంలో ఆరోగ్యకర పోటీ ఉండేలా, ఆధిపత్యం అణగతొక్కేలా చర్యలు తీసుకోవాలి.

అప్పుడు మాత్రమే ప్రజలు గౌరవించిన సేవలను పొందగలరు.

ఇండిగో ఉదంతం దేశానికి చెబుతున్న కఠిన సత్యం ఇదే—

ఏ వ్యవస్థలోనైనా ఏకచత్రాధిపత్యం పెరిగితే ప్రజలు పడేది నష్టమే.

అందుకే పోటీ తప్పనిసరి, ప్రత్యామ్నాయం అవసరం.