గీత కులాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

-గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్









గుంటూరు, డిసెంబర్ 2 (ravikiranalu): : గీత కులాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుంటూరు 1 ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ చెప్పారు. రాజకీయ, ఆర్ధిక, విద్యా రంగాలలో బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు పునాదులు వేశారని, అదే స్ఫూర్తితో టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నాడు గీత కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహాసభ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన అక్కను వేధిస్తున్నారని నిలాదీస్తే అమర్నాథ్ గౌడ్ అనే బాలుడుని సజీవ దహనం చేశారని, జై జగన్ అనేందుకు నిరాకరించిన తెలుగుదేశం బిసి కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబాన్ని పాశవికంగా గొంతు కోసి హత్య చేశారని నజీర్ అహ్మద్ గుర్తు చేశారు. బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 

గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ.. గీత కులాల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు బిసిల ప్రగతి కోసం అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలలో నాడు బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తే చంద్రబాబు వాటిని 34 శాతానికి పెంచారని చెప్పారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు మాట్లాడుతూ.. గీత కులాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మద్యం షాపులు, బార్ లైసెన్సుల కేటాయింపులో గీత కులాలకు కూటమి ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్స్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 కల్లుగీత కార్మికులకు ఎక్సయిజ్ శాఖ ఇచ్చే గుర్తింపు కార్డులను ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, వృత్తి నిర్వహణలో గాయపడిన కార్మికులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన వారికి తక్షణమే ఎక్సగ్రేషియా తక్షణమే చెల్లించాలని గీత కులాల మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. కల్లుగీత కార్పొరేషన్ ను నీరా కార్పొరేషన్ తో కలిపి ఏర్పాటు చేసి వృత్తిదారులు వ్యాపారం చేసుకునేందుకు రూ. 1000 కోట్లు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. నీరా, టాడి ఉత్పత్తుల అధ్యాయనానికి ఒక కమిటీని వేసి తెలంగాణా, కేరళ, బీహార్ రాష్ట్రాలలో అమలు జరుపుతున్న తీరును పరిశీలించాలని మహాసభ విజ్ఞప్తి చేసింది. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మిగులు భూములలో తాటి, ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సాహించారని పేర్కొంది. ఇప్పుడు కూడా ఆ విధంగా కోస్తా ప్రాంతంలో తాటి, రాయలసీమలో ఈత వనాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మహాసభ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ఈడిగ సంఘం అధ్యక్షులు మేకల వేణుగోపాల్, రాష్ట్ర యాత సంఘం అధ్యక్షులు అంగటి రాము, శ్రీశయన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోడ అప్పారావు, గీత కులాల సంక్షేమ సంఘం నాయకులు కంచర్ల వెంకటేశ్వరరావు, పేరం ఆదివిష్ణు, వీరవల్లి శ్రీనివాస్, వీరమల్లు సూరిబాబు, కంచర్ల కోటయ్య, జంపన సుధాకర్, యేమినీడి లక్ష్మి శైలజ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు గీత కులాల ప్రతినిధులు గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.