పులుల మరణాల తగ్గింపునకు ఏం చర్యలు తీసుకున్నారు?

 లోక్ సభలో అడిగిన ఆదాల

 పులుల మరణాలు పెరుగుతున్న తరుణంలో వాటి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్ సభలో ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అశ్వని కుమార్ చౌబే  దీనికి రాతపూర్వకంగా సమాధానమిస్తూ 2019 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్లో 3 పులులు మరణించాయని, దేశంలో 329 పులులు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. ఇప్పుడు పులుల సగటు ఆయువు 10 నుంచి 12 సంవత్సరాలని, ఇవి వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత తగాదాలు, అధిక శిశుమరణాలు, విద్యుత్ ఘాతం, ఉచ్చులు, మునిగిపోవడం, రోడ్డు, రైలు ప్రమాదాల వల్ల దెబ్బలు మొదలైన అనేక అంశాలు పులుల మరణాల్లో ఉంటాయని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే వేట, మానవ- జంతు సంఘర్షణలతో పులుల మరణాలు తగ్గాయని తెలిపారు. పులుల సంరక్షణకు భద్రతా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నట్లు, పులుల మరణాలను అరికట్టేందుకు గాను అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకుగాను నిధులను కూడా కేటాయించినట్లు తెలిపారు.