అమరావతి: మూడు రాజధానులపై సీఎం జగన్‌ నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాడుతుంటే భుజం తట్టకుండా మరో రాగమెత్తుకున్నారని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విటర్‌లో సోమిరెడ్డి స్పందించారు. ''అప్పుడు ప్రజారాజ్యం పెట్టి దాన్ని మరో పార్టీలో కలిపారు. మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యారు. ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టకుండా మరో రాగమెత్తుకున్నారు. తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే. మళ్లీ దూకేస్తారేమో'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.