ఆత్మకూరులో రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన నాలుగు లేన్ల బైపాస్ రహదారి ప్రారంభం
వాయుపుత్ర మార్గ్‌గా నామకరణం.. వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
ఆత్మకూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం.. మంత్రి ఆనం విజ్ఞప్తులపై పవన్ సానుకూల స్పందన
బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆత్మకూరు పట్టణ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది : మంత్రి ఆనం
ఆత్మకూరు, రవికిరణాలు : రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన ఎన్‌హెచ్-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన నాలుగు లేన్ల రహదారిని మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆత్మకూరు అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 2.2 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు, ఆధునిక హంగులతో తీర్చిదిద్దే పనులు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.6.31 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో మరో రూ.2.60 కోట్లతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. ఆత్మకూరు ప్రజలు జాతీయ రహదారిని చేరుకునేందుకు గతంలో ఇరుకైన రహదారి, గుంతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ముఖ్యంగా స్థానికులు, విద్యార్థులు, రైతులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రహదారిని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రహదారి సమీపంలోని ఆలయంలో కొలువైన 50 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారికి ‘వాయుపుత్ర మార్గ్’గా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల కింద 9 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించామని, మరో 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చామని వివరించారు. పల్లె పండుగ 3.0 కింద మరో 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు 161 డొంక రోడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఆత్మకూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం: పవన్ కళ్యాణ్
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి విజ్ఞప్తులపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆత్మకూరు మెట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ ద్వారా అవసరమైన చర్యలు చేపట్టాలని, సంగం మండలం వీర్లగుడిపాడు వద్ద పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, తదుపరి చర్యలను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. నర్సాపురం నుంచి నాగులపాడు వరకు రహదారి విస్తరణ అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె ఆనం లీలా కైవల్య రెడ్డితో పాటు స్థానిక మహిళా ప్రజాప్రతినిధులను మంత్రి పరిచయం చేయగా, వారిని అభినందించిన ఉప ముఖ్యమంత్రి మహిళా శక్తి ప్రాధాన్యతను ప్రస్తావించారు.
దశాబ్దాల కల సాకారం.. ప్రజలకు రహదారిని అంకితం చేస్తున్నాం: మంత్రి ఆనం
ఆత్మకూరు ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బైపాస్ రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 2012–13లో సింగిల్ లేన్ రహదారిగా ప్రారంభమైన పనులు గతంలో పూర్తికాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరిన తొలి అభ్యర్థనల్లో ఈ రహదారి విస్తరణ ఒకటని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి రూ.6.31 కోట్లు మంజూరు చేయడంతో నాలుగు నెలల్లోనే రహదారి విస్తరణ పనులను పూర్తి చేయగలిగామని మంత్రి వివరించారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.2 కోట్లు, నుడా కింద రూ.60 లక్షలు సమకూరడంతో మొత్తం రూ.8.91 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్ డివైడర్, లైటింగ్, సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే మహిళలు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి రహదారిని అభివృద్ధి చేశామని చెప్పారు. ఆత్మకూరు మెట్ట ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సోమశిల రిజర్వాయర్‌ను ఆధారంగా చేసుకుని జల్ జీవన్ మిషన్ కింద రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు మంత్రి తెలిపారు. సంగం మండలం వీర్లగుడిపాడు వద్ద పెన్నా నదిపై వంతెన, కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు, నర్సాపురం నుంచి నాగులపాడు వరకు రహదారి విస్తరణకు రూ.24 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా రూ.17 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఎన్నికల అనంతరం మరో రూ.14 కోట్ల సీసీ రోడ్లకు నిధులు ఇస్తామని హామీ లభించిందని మంత్రి పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సుమారు రూ.29–30 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లు, తాగునీటి సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆత్మకూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి ఆనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సందడిగా సాగిన కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలో బైపాస్ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొన్న సమయంలో అభిమానులు కేరింతలు, జేజేలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గార్ల సమక్షంలో రహదారి అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.