పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు

నెల్లూరు, రవికిరణాలు :   దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేయడంతో సరిపోదని.. బకాయిలను సమర్థవంతంగా వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లను విద్యుత్‌ బిల్లులతో అనుసంధానించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు రూ.45 వేల కోట్ల విలువైన ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటివరకు సుమారు రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు కోర్టుకు వెల్లడైంది. బకాయిల వసూళ్ల కోసం వాహన రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పీయూసీ, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లపై ఆంక్షలు విధించడం, అవసరమైతే వాహనాలను జప్తు చేయడం వంటి చర్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పెండింగ్‌ చలాన్లను త్వరితగతిన వసూలు చేసేందుకు పటిష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు సూచించింది.