అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి కొత్త నాయకత్వం

 మూడు దశాబ్దాల అంతరిక్ష అనుభవానికి గుర్తింపు

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట /శ్రీహరికోట:-


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ఎస్. ముత్తుచెళియన్ నియమితులయ్యారు. ప్రస్తుతం షార్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, మే 31న పదవీ విరమణ పొందిన ఈ.ఎస్. పద్మకుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడుకు చెందిన ఎస్. ముత్తుచెళియన్ 1967 జూలై 13న జన్మించారు. 1991లో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన అనంతరం ఇస్రోలో చేరిన ఆయన, మూడు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో విశిష్ట సేవలు అందించారు. ప్రయోగ వాహనాల రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగాల నిర్వహణ వంటి కీలక విభాగాల్లో ఆయన విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం షార్ అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ముత్తుచెళియన్, సంస్థ అభివృద్ధి మరియు అంతరిక్ష ప్రయోగాల విజయవంతమైన అమలులో కీలక పాత్ర పోషించారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా గుర్తింపు పొందిన షార్‌కు డైరెక్టర్‌గా ఆయన నియామకం కావడం ఇస్రో వర్గాల్లో హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగాలు, జాతీయ అంతరిక్ష కార్యక్రమాల అమలులో ముత్తుచెళియన్ అనుభవం, నాయకత్వం సంస్థకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.