తడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు( ఐపీఎస్)
తడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు( ఐపీఎస్)
--- పాత కేసులను త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీట్లు వేయాలి
--- స్టేషన్‌లోని పాత వాహనదారులకు నోటీసులు.. స్పందించకపోతే చట్టపరమైన చర్యలు
---రహదారులపై పాదచారుల ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
---బీవీ పాలెం చెక్ పోస్ట్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ ఆదేశం
రవికిరణాలు తిరుపతిజిల్లా సూళ్లూరుపేట/తడ:-
తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ గారు బుధవారం సూళ్లూరుపేట డిఎస్పీ చెంచుబాబు గారితో కలిసి తడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ గారు వార్షిక రికార్డులను, లాకప్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న పాత కేసుల వివరాలపై సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ, తడ సబ్ ఇన్స్పెక్టర్ కొండప్పనాయుడులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. స్టేషన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, వెంటనే కోర్టులలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బైక్‌లు, ఇతర వాహనాల యజమానులను గుర్తించి, తక్షణమే నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులు అందుకున్నప్పటికీ స్పందించని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇటీవల జాతీయ రహదారులు, స్థానిక రోడ్లపై పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తుండటంపై ఎస్పీ గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని సీఐ ఎం.మురళీకృష్ణ, ఎస్సై కొండప్పనాయుడులను ఆదేశించారు.
బీవీ పాలెం చెక్ పోస్ట్ పరిశీలన:
అనంతరం ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు గారు తమిళనాడు సరిహద్దుల్లోని బీవీ పాలెం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌ను డిఎస్పీ చెంచుబాబు గారితో కలిసి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను, వాహనాల తనిఖీ విధానాన్ని పరిశీలించారు. సరిహద్దు గుండా జరిగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విధుల్లో ఎలాంటి అజాగ్రత్త వహించకుండా, పూర్తి జాగ్రత్తలతో పనిచేయాలని అక్కడ ఉన్న సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు,సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, తడ ఎస్సై కొండప్పనాయుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.