హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత నౌకల భద్రతపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ భారత నౌకలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. "భారత మిత్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు" అని పేర్కొంది.
ప్రపంచ ఇంధన రవాణాకు కీలక మార్గం
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా గుర్తించబడింది. ప్రపంచంలో సుమారు 20 శాతం చమురు రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలపై పరిమితులు విధించినట్లు సమాచారం.
స్నేహపూర్వక దేశాలకు అనుమతి
అయితే భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలకు మాత్రం అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు కొంత ఊరట లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే 8 భారత నౌకలు ప్రయాణం
ఇప్పటివరకు ఎనిమిది భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు సమాచారం. వాటిలో BW TYR, BW ELM అనే రెండు ఎల్‌పీజీ క్యారియర్లు ఉన్నాయి. ఈ నౌకల ద్వారా సుమారు 94 వేల టన్నుల ఎల్‌పీజీ భారత్‌కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
hormuz strait iran
ఇంకా చిక్కుకున్న నౌకలు
అయితే భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ, ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ సరుకుతో మరో 19 నౌకలు ఇంకా జలసంధి వద్దే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ సంక్షోభం కారణంగా మొత్తం 500 నౌకలు హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.