సూళ్లూరుపేట లో ‘ఎన్‌డీపీఎస్’ కిట్లతో గంజాయి బ్యాచ్‌కు షాక్!*

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో "గంజాయిని నిర్మూలిద్దాం" అనే లక్ష్యంతో పోలీస్ శాఖ సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. గంజాయి రహిత సమాజ స్థాపన కోసం బుధవారం సూళ్ళూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భారీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ జీ. చెంచుబాబు పర్యవేక్షణలో, సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్  ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 110 మంది అనుమానితులను సేకరించి, వారికి అధునాతన ఎన్‌డీపీఎస్ (ఎన్‌డీపీఎస్’) కిట్ల ద్వారా అక్కడికక్కడే మూత్ర పరీక్షలు (యూరిన్ టెస్ట్స్) జరిపారు. ఈ విస్తృత తనిఖీలలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్, తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు, సూళ్ళూరుపేట రూరల్ ఎస్సై సుబ్రమణ్యం రాజు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.


​ఈ సందర్భంగా డీఎస్పీ జీ. చెంచుబాబు విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక బస్, ఎన్‌డీపీఎస్ కిట్ల ద్వారా గంజాయి తాగే వారిని ఇట్టే పసిగట్టవచ్చని తెలిపారు. గత రెండు నెలల కాలంలో ఎప్పుడు గంజాయి సేవించినా సరే, ఈ కిట్ ద్వారా చేసే పరీక్షల్లో పాజిటివ్ అని తేలిపోతుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను లోతుగా విచారించి, వారికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ముఠా సూత్రధారులు ఎవరు? అనే బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ లింకేజీలను పూర్తిగా కట్టడి చేస్తామన్నారు. రాత్రి పూట అనుమానాస్పదంగా తిరిగే వారు, గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు, గంజాయి తాగి గొడవలు చేస్తూ విపరీతంగా ప్రవర్తించే వారిని పట్టుకొని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నాయుడుపేట, సూళ్ళూరుపేట, తడ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వలస కార్మికుల అలవాట్లు, వారి రాకపోకలపై గట్టి నిఘా ఉంచామని, అలాగే పోలీసు రికార్డుల్లో గంజాయి వినియోగదారులుగా నమోదైన పాత నేరస్థులను కూడా తీసుకొచ్చి పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.


గంజాయికి బానిసలైన వారు మారేందుకు పోలీస్ శాఖ ఒక సువర్ణావకాశాన్ని ఇస్తోందని, ఈ పరీక్షల అనంతరం గంజాయి అలవాటును పూర్తిగా మానేసి, 2 లేదా 3 నెలల తర్వాత జరిగే తదుపరి పరీక్షల్లో నెగటివ్ అని నిరూపించుకుంటే.. అలాంటి వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానిస్తామని డీఎస్పీ జీ. చెంచుబాబు ప్రకటించారు. ఒకవేళ అలవాటు మార్చుకోకుండా మళ్లీ మళ్లీ గంజాయి సేవిస్తూ పట్టుబడితే మాత్రం వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 'ఈగల్' అనే సంస్థను ఏర్పాటు చేశామని, అన్ని స్కూళ్లు, కాలేజీల్లో సదస్సులు నిర్వహిస్తూ, గంజాయి వినియోగదారుల బ్యాంక్ లావాదేవీలపై సైతం నిఘా పెట్టామన్నారు. సమాజంలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే 112 నంబరుకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన కోరారు.