85 శాతం రాయితీతో పశుబీమా
85 శాతం రాయితీతో పశుబీమా
పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం
పొదలకూరు రవి కిరణాలు సెప్టెంబర్ 28 : పశుపోషకులకు అకాల పశుమరణాలతో కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నూతన పశుబీమా పథకాన్ని అమలు చేస్తోందని పొదలకూరు పశుసంవర్ధక శాఖ ఏడీ అరుణ తెలిపారు. ఈ పథకంలో పశుపోషకులు చెల్లించాల్సిన ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వమే రాయితీగా భరిస్తుందని పేర్కొన్నారు.ఆవులు, గేదెలకు మూడు సంవత్సరాల కాలానికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి ఈనిన 2 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల ఆవులు, 3 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల గేదెలు బీమాకు అర్హులని చెప్పారు. ఒక కుటుంబానికి లేదా రేషన్ కార్డుకు గరిష్ఠంగా 10 పశువులకు బీమా వర్తిస్తుందని వివరించారు.మేలు జాతి ఆవులు, గేదెలకు ఒక్కో పశువుకు రూ.30 వేల బీమా వర్తిస్తుందని, ఇందుకు రూ.1,920 ప్రీమియంలో ప్రభుత్వం రూ.1,632 (85 శాతం) రాయితీగా చెల్లిస్తుండగా, లబ్ధిదారుడు కేవలం రూ.288 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నాటు జాతి పశువులకు రూ.15 వేల బీమా వర్తిస్తుందని, రూ.960 ప్రీమియంలో ప్రభుత్వం రూ.816 రాయితీ ఇవ్వగా, లబ్ధిదారుడి వాటా రూ.144 మాత్రమేనన్నారు.అదేవిధంగా గొర్రెలు, మేకలు, పందులకు కూడా పశుబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏడీ అరుణ తెలిపారు. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గొర్రెలు, మేకలు బీమాకు అర్హులని, ఒక కుటుంబానికి లేదా రేషన్ కార్డుకు సంవత్సరానికి గరిష్ఠంగా 100 జీవాలకు బీమా వర్తిస్తుందని చెప్పారు. ఒక్కో గొర్రె, మేక, పందికి రూ.6 వేల బీమా సౌకర్యం ఉంటుందన్నారు.ఒక సంవత్సరం కాలానికి రూ.180 ప్రీమియంలో లబ్ధిదారుడి వాటా రూ.27, రెండేళ్లకు రూ.270 ప్రీమియంలో రూ.40, మూడేళ్లకు రూ.375 ప్రీమియంలో రూ.56 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం 85 శాతం రాయితీగా భరిస్తుందని తెలిపారు.
