మంత్రి నారాయణ మాస్ పిక్చర్
మంత్రి నారాయణ మాస్ పిక్చర్
రోడ్డు పక్కనే టీ.. టిఫిన్.. టెంకాయల బండి వద్ద ముచ్చట్లు
కారు దిగి ప్రజల్లో కలిసిపోయిన మంత్రి.. 53, 54వ డివిజన్లలో ఆకట్టుకున్న పర్యటన
నెల్లూరు, కార్పొరేషన్, రవి కిరణాలు : అధికార హోదా, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రజల మధ్య సామాన్యుడిలా కలిసిపోయారు మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో సోమవారం ఆయన నిర్వహించిన పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి.
కారు దిగి నేరుగా వీధుల్లోకి వెళ్లిన మంత్రి స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగి స్థానికులతో కరచాలనం చేసి, వారితో కలిసి టీ తాగారు. అనంతరం సాధారణ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు.
53వ డివిజన్‌లో టెంకాయలు విక్రయిస్తున్న మహిళ వద్ద మంత్రి కొద్దిసేపు ఆగి ఆమెతో ఆత్మీయంగా మాట్లాడారు. “వ్యాపారం ఎలా జరుగుతోంది అమ్మా.. కుటుంబం సౌఖ్యంగానే ఉందా?” అంటూ ఆమె పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తన సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకోవడంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
ప్రజలతో మమేకం
నగర వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న మంత్రి.. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం స్థానికులను ఆకట్టుకుంది.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకునే నాయకుడిగా మంత్రి నారాయణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా పలువురు ప్రజలు ఆయనతో ఆత్మీయంగా మాట్లాడి తమ సమస్యలను వివరించారు.
మంత్రి వెంట నగర మేయర్ డి. సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
