వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘటోత్సవం




వెంకటగిరి, సెప్టెంబర్ 27,రవి కిరణాలు :

 దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో భాగంగా ఘటోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఘటోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఘటాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించడంతో వీధులు భక్తులతో కిక్కిరిశాయి.

జీనుగుల వారి వీధిలోని అమ్మవారి అలంకరణ మండపం, పోలేరమ్మ ఆలయం, కర్ణకమ్మ వీధిలోని అమ్మవారి గుడి వద్ద ఘటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఘటోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ, ఈఓఆర్‌ఓ భూమి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

ఘటోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి, డీఎస్పీ చెంచుబాబు, సీఐ రోశయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు భద్రత కల్పించారు.