వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం


• పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు

• 100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు

• బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను   తీసుకొచ్చాం 

• ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం  

• అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం 

• గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 

• పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు 

• 22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు 

• కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ 

• ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి

• అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం 

• ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం


నెల్లూరు, రవితేజ బ్యూరో, రవి కిరణాలు :
  పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో  పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తో కలసి  పవన్ కళ్యాణ్  ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ - అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతులు, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం.

గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం:

గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఇతర కాలనీల్లో 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఇప్పటికే పూర్తి చేసింది. గిరిజన గ్రామాలకు రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేందుకు అడవితల్లిబాట కార్యక్రమం కింద రూ.2,180 కోట్ల వ్యయంతో సుమారు 2,437 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందులో ఇప్పటికే 1500 కిలోమీటర్లకు పైగా అనుసంధాన రహదారులను నిర్మించాం. అలాగే, ఇప్పటివరకు రోడ్డు అనుసంధానం లేని బంజారా, యానాది, ఎరుకుల గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో, పల్లెపండుగ ద్వారా 167 ఆవాసాలకు 111.4 కి.మీ. మేర రహదారి సౌకర్యం కల్పించాం.

పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు:

ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, గౌరవ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం. ఇందులో రూ.30 వేల కోట్లతో అక్టోబర్ 5న గౌరవ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు తో కలిసి జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్, సింగిల్ విలేజ్ స్కీమ్ పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నాం. అలాగే రూ.9 వేల కోట్లతో పల్లెపండుగ 1.0, 2.0 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి, ఈ రోజు రూ.11,085 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పల్లెపండుగ 3.0ను ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయబోతున్నాం. అలాగే, 1,000 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం.  

పైలెట్ ప్రాజెక్ట్ గా డొంక రోడ్ల అభివృద్ధి :

ఎన్నో ఏళ్లుగా రైతులు తమ పంటలను మార్కెట్‌కు తరలించేందుకు డొంక రోడ్ల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుగా పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రతి నియోజకవర్గంలో ఒక డొంక రోడ్డును అభివృద్ధి చేయబోతున్నాం. ఆ తర్వాత 161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్‌కు తీసుకెళ్లేలా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచబోతున్నాం.  

ఉదయగిరి ఇక అభివృద్ధి బాటలో:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే దాదాపు రూ.520 కోట్లతో పల్లెపండుగ పనులు చేపట్టాం. ఇంకా మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం. మన ఉదయగిరిలోనే పల్లెపండుగ ద్వారా రూ.121 కోట్లతో 115 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్లు, 1,200కు పైగా నీటి కుంటలు, 348 గోకులాలు, 190కి పైగా నీటి తొట్లు, సుమారు 900 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశాం. ఉదయగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా, గతంలో నిలిచిపోయిన సుజల శ్రవంతి పథకం ద్వారా రూ.52 కోట్లతో, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కొండాపురం, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో 381 పనులు చేపట్టబోతున్నాం. ఉదయగిరి కోటకు చేరుకునే మార్గంలో సుమారు 4 కి.మీ. రహదారిని రూ.2.5 కోట్లతో మంజూరు చేస్తున్నాం. దీనికి అవసరమైన అటవీ శాఖ అనుమతులను త్వరగా పొందేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశిస్తున్నాను. ఉదయగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేసి, స్వదేశీ దర్శన్, సాస్కీ పథకాల ద్వారా అవసరమైన నిధులు సమకూర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే, ఉదయగిరి కొండను హెరిటేజ్ టూరిజం ప్రాంతంగా, ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఉదయగిరిలో ఇప్పటికే క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్  ఏర్పాటు చేసి, వేప, బిక్కి, కల్ది, పాలబర్క్ వంటి చెక్కలను అందుబాటులోకి తీసుకొచ్చాం. చెక్క స్పూన్లు, గిన్నెలు, చెక్కబొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందిన స్థానిక కళాకారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, వారు తమ ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు అనుగుణంగా సొసైటీ భవనాల మరమ్మతు పనులు చేపడుతున్నాం. త్వరలో శాశ్వత భవనాలను కూడా నిర్మించబోతున్నాం. ఒకప్పుడు గజ్జలవారిపల్లి పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా రహదారి కోసం చేసిన విజ్ఞప్తి నా దృష్టికి రాగానే, వెంటనే స్పందించి ఆ రహదారి పనులను కూడా పూర్తి చేశాం. అలాగే కావలి నియోజకవర్గంలోని గోగులపల్లి గ్రామ పంచాయతీ ఉప్పు సత్యాగ్రహం సమయంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతం. అక్కడి ప్రజలు తమ ఉప్పు ఉత్పత్తులను రవాణా చేసుకునేందుకు రహదారి సౌకర్యం కల్పించాలని నా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తి మేరకు సుమారు 1.9 కి.మీ. రహదారిని రూ.3.5 కోట్లతో నిర్మించేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తాం. ఈ పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను.  

ప్రజల భాగస్వామ్యంతో ప్రగతి సాధ్యం : 

అభివృద్ధి పనుల్లో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. మన గ్రామంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని ప్రజలు తమ పనిగా భావించి, దాని పురోగతిని గమనించాలి. కాంట్రాక్టర్ పనులు నాణ్యతగా చేస్తున్నారా? నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అనే విషయాలను ప్రజలు పరిశీలించాలి. ఎక్కడైనా అనుమానం వచ్చినా, నాణ్యతలో లోపం కనిపించినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే సోషల్ ఆడిట్ ద్వారా పనుల వివరాలను, ఖర్చులను, నాణ్యతను ప్రజల ముందే పరిశీలించవచ్చు. ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతుంది. ఆ పనులు సక్రమంగా, నాణ్యతగా జరిగేలా చూడటం, ప్రశ్నించడం, పర్యవేక్షించడం ప్రభుత్వం తో పాటు ప్రజల బాధ్యత కూడా. ప్రజలు భాగస్వాములై అభివృద్ధి పనులను పర్యవేక్షించినప్పుడే మన గ్రామాల అభివృద్ధి మరింత పారదర్శకంగా, నాణ్యతగా ముందుకు సాగుతుంది. ఈ రోజు ఉదయగిరి నుంచి మొదలైన ఈ ప్రయాణం, రేపటి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త మార్గాన్ని చూపాలి.. ఇక్కడ మొదలైన ఈ పల్లెపండుగ 3.0... అభివృద్ధి పట్ల మనందరి భాగస్వామ్యానికి ఒక కొత్త ఆరంభం కావాలి అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు  ఆనం రామనారాయణ రెడ్డి,  పొంగూరు నారాయణ,  ఎన్.ఎం.డి. ఫరూక్,  నిమ్మల రామానాయుడు,  గొట్టిపాటి రవికుమార్, బి.సి. జనార్థన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు  బీద మస్తాన్ రావు, ఉదయగిరి శాసన సభ్యులు  కాకర్ల సురేష్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి  కాంతిలాల్ దండే, కమిషనర్  కృష్ణతేజ, జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్లా, కూటమి పార్టీలకు చెందిన శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.