ఏపీలో పెన్షన్‌దారులకు శుభవార్త.. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ


నెల్లూరు, రవి కిరణాలు:
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందనుంది. ఇటీవల బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పెన్షన్ల పంపిణీపై కొంత ఆందోళన నెలకొంది. అయితే బ్యాంకు ఉద్యోగులు సమ్మె విరమించడంతో పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమమైంది. అక్టోబర్‌ 1న ఉదయం నుంచే గ్రామ, వార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల పెన్షన్‌పై ఆధారపడే లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది.


61.80 లక్షల మంది లబ్ధిదారులు

రూ.2,692.34 కోట్ల నిధులు

అక్టోబర్‌ 1 నుంచి పంపిణీ

ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభం