అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కృష్ణా జలాలు విడుదల చేయాలి.. ఎగువ రాష్ట్రాలతో చర్చించి నెల్లూరు రైతుల హక్కులు కాపాడాలి.. బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్..

నెల్లూరు, అక్టోబర్ 14:   అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కండలేరు జలాశయానికి కృష్ణా నికర జలాలను రప్పించి, అక్కడి నుంచి చెన్నైకి తాగునీరు విడుదల చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కండలేరు డ్యామ్‌లో నీటి నిల్వలను బుధవారం  ఆయన బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విడతల రమేష్ మాట్లాడుతూ  జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని  కోరారు. 1975లో చెన్నై నగరానికి తాగునీరు అందించేందుకు అంతర్రాష్ట్ర ఒప్పందాలు జరిగాయని  తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కృష్ణా జలాల వాటాలను ఒప్పందాల ప్రకారం కండలేరు జలాశయానికి తీసుకురావాల్సి ఉందన్నారు. అయితే ఎగువ రాష్ట్రాల నుంచి నికర జలాలు విడుదల కావడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో చర్చించి కండలేరుకు రావాల్సిన నీటిని సాధించాలని డిమాండ్ చేశారు. ఈ జల సంవత్సరంలో శ్రీశైలం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతుల నీటి హక్కులకు విఘాతం కలుగుతున్నప్పటికీ, మానవతా దృక్పథంతో కండలేరు నుంచి చెన్నైకి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఒకవైపు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండగా, మరోవైపు చెన్నై తాగునీటి అవసరాలను తీర్చాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహారాష్ట్రలోని కొయినా డ్యామ్ నుంచి విద్యుదుత్పత్తి పేరుతో భారీ మొత్తంలో నీరు సముద్రంలోకి వెళ్తోందని, ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగువ రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లాలని రమేష్ సూచించారు. ఒప్పందాల ప్రకారం రావాల్సిన నికర జలాలను సాధించకుండా వెలిగొండ, నల్లమలసాగర్ ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై ముందుకు సాగడం సమంజసం కాదన్నారు. కండలేరు జలాశయానికి చట్టబద్ధంగా రావాల్సిన నీటిని రాబట్టుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. నెల్లూరు జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు చెన్నై తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఎగువ రాష్ట్రాలతో చర్చలు జరిపి కృష్ణా నికర జలాలను కండలేరుకు రప్పించిన అనంతరం, ఒప్పందాల ప్రకారం చెన్నైకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరాల సుబ్బారెడ్డి, సృజన, ఆదినారాయణ,  పెంచలయ్య, వెంకటరత్నం నాయుడు, వాకా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.