పేద విద్యార్థి చదువుకు అండగా నాగిశెట్టి మురళీకృష్ణ
గూడూరు, రవి కిరణాలు : పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదనే సంకల్పంతో మరో పేద విద్యార్థి ఉన్నత చదువుల బాధ్యతను నాగిశెట్టి మురళీకృష్ణ స్వీకరించారు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన చింతల జస్వంత్ అనే విద్యార్థి చదువులో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ, తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితిని గుర్తించిన మురళీకృష్ణ, విద్యార్థి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫీజు రూ.40 వేలు చెల్లించడంతోపాటు, బీటెక్ నాలుగేళ్ల చదువుకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు.జస్వంత్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించడం అతనికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థి ప్రతిభను గుర్తించిన నాగిశెట్టి మురళీకృష్ణ అండగా నిలిచారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం పొందే వరకు విద్యార్థి చదువుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు.గతంలోనూ నాగిశెట్టి మురళీకృష్ణ పది మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువుకు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులకు చేయూతనిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో మురళీకృష్ణ అందిస్తున్న సహకారం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం లో ఆయన వెంట బలిజ చేయూత ఫౌండేషన్ ముఖ్యులు కత్తెర మల్లి, పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
