40 ఏళ్లుగా గెలవని చోట టీడీపీ జెండా ఎగురవేశాడు...
బాధ్యత తీసుకున్నాడు.. భుజస్కందాలపై మోశాడు....
40 ఏళ్లుగా గెలవని చోట టీడీపీ జెండా ఎగురవేశాడు.
నెల్లూరు, రవి కిరణాలు : నాలుగు దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గెలుపు దక్కని జెండా వీధి, ముస్లిం ప్రాంతాల్లో విజయపతాకం ఎగురవేసి, తన నాయకత్వ సత్తా చాటారు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. పురపాలక శాఖ మంత్రివర్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులు పొంగూరు నారాయణ తనకు అప్పగించిన ఏడు డివిజన్ల గెలుపు బాధ్యతను భుజస్కందాలపై మోసి, ఏడింటినీ విజయతీరాలకు చేర్చారు. పాత రాజకీయ సమీకరణాలను తిరగరాస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. బాధ్యత తీసుకున్న నాటి నుంచి గెలుపే లక్ష్యంగా అజీజ్ ముందుకు సాగారు. అనేక వ్యూహాలు రచించడంతోపాటు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ముఖ్యమైన వైసీపీ నాయకులను టీడీపీ గూటికి చేర్చారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి, ఓటర్లను నేరుగా కలుస్తూ టీడీపీకి మద్దతు కోరారు. నాయకులు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ప్రచారాన్ని ముందుండి నడిపించారు.
గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన ముస్లిం ఓటర్లలో టీడీపీకి ఆదరణ కూడగట్టడంలో అజీజ్ కీలకపాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ వైపు నిలిచిన ఓటర్ల మద్దతును టీడీపీ వైపు మళ్లించారు. ఈ ప్రయత్నాలతో 40 ఏళ్లుగా గెలుపు దక్కని చోట టీడీపీని గెలిపించి చూపించారు. నెల్లూరు నగరంతోపాటు రూరల్ నియోజకవర్గంలోనూ అజీజ్ విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. తానే కాకుండా తన సోదరుడు అబ్దుల్ జలీల్ సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించి విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు బాధ్యత అప్పగించిన డివిజన్ల కే పరిమితం కాకుండా సాధ్యమైనన్ని డివిజన్లు అన్నిటిలో ప్రచారం నిర్వహించారు.
ఒకవైపు వ్యూహాలు రచిస్తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ తనకు అప్పగించిన డివిజన్ల బాధ్యతను చివరి వరకు మోశారు. టీడీపీ విజయపతాకం ఎగురవేశారు. ఈ ఫలితాలు అజీజ్ నాయకత్వానికి, నిదర్శనంగా నిలిచాయి. పదవికి వన్నె తెచ్చేది నాయకుడి పనితీరే. కార్యకర్తలతో భుజం కలిపి, ప్రజల మద్దతుతో విజయాన్ని సాధించిన అజీజ్ అందుకు ఉదాహరణగా నిలిచారు. వ్యూహంలో నేర్పు… క్షేత్రస్థాయిలో చొరవ… అందరినీ ముందుకు నడిపించడంలో నాయకత్వం… ఈ మూడింటితో విజయానికి బాటలు వేశారు. తనపై ఉంచిన నమ్మకానికి ఏడు విజయాలతో సమాధానం ఇచ్చారు అబ్దుల్ అజీజ్!
