చేతివృత్తులకు చేయూతగా విశ్వకర్మ యోజన పథకం: ఆకాశవాణి రీజినల్ న్యూస్ హెడ్ హెన్రీ రాజ్వి





విజయవాడ జూలై 19(రవి కిరణాలు. ప్రతినిధి):

సాంప్రదాయ కళాకారులు మరియు చేతివృత్తుల వారికి ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం విశ్వకర్మ యోజనను ఉపయోగించుకోవాలని,  ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి హెన్రీ రాజ్ శనివారం  విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని   ఎంఎల్ఎ క్యాంప్ ఆఫీస్ లో 'మై భారత్' వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఒక రోజు వర్క్‌షాప్‌లో  లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. 

'మై భారత్' వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హెన్రీ రాజ్, విశ్వకర్మ యోజన సాంప్రదాయ కార్మికుల నైపుణ్యాలను దేశాభివృద్ధికి ఉపయోగించుకునేలా రూపొందించబడిందని ,దేశ పురోగతికి దోహదపడటానికి ప్రతి వ్యక్తి వ్యవస్థాపకుడిగా మారాలని సూచించారు.  

 ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ,  యువత సోషల్ మీడియా తప్పుడు కథనాల ఉచ్చులో పడకూడదని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని దేశాభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు. 

అదేవిధంగా, జిల్లా యువజన అధికారి (మై భారత్) సుంకర  రాము కూడా యువత ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు.

పీఎంఈజీపీ (ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) గురించి వివరిస్తూ, భవానీపురం ఎస్ బీ ఐ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ యువత ఆలోచన ప్రభుత్వ ఉద్యోగాలకు  మాత్రమే పరిమితం కాకుండా పీఎంఈజీపీ పథకాన్ని ఉపయోగించుకొని పరిశ్రమలను  స్థాపించే దిశగా అన్ని రంగాలలో అవకాశాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో, యూనియన్ బ్యాంక్ భవానీపురం మేనేజర్, సుజన  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పథకం  పీఎం ఆవాస్ యోజన క్రింద పేదలు  ఇళ్ల నిర్మాణానికి 1.8 లక్షల వరకు సబ్సిడీలను పొందవచ్చని, లబ్ధిదారులు మరిన్ని వివరాలకోసం  సమీప  బ్యాంకులను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

దూరదర్శన్ న్యూస్ ఆంధ్రా రీజియన్ ఎడిటర్ పురుషోత్తం రెడ్డి సహా స్థానిక ప్రజలు , యువత ఈ  వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

వర్క్‌షాప్‌లో  భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వ వివిధ పథకాలకు సంబందించిన పుస్తకాల  స్టాల్‌ను ఏర్పాటు చేసింది.  అదేవిధంగా  11 సంవత్సరాల NDA ప్రభుత్వ పాలన మరియు పురోగతిపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించిన పుస్తకం కూడా వర్క్ షాప్ లో విడుదల చేశారు .