నిర్దేశించిన సమయంలోపు సమస్యలు పరిష్కారించాలి కమిషనర్ 

కమిషనర్ వై.ఓ నందన్ 




నెల్లూరు [కార్పోరేషన్], రవికిరణాలు జూలై 21 :

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి, సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. 

ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటికోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. 

అనుమతులు లేని భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 13 భవనాల నుంచి అపరాధ రుసుమును వసూలు చేశామని కమిషనర్ వెల్లడించారు. అక్రమ కట్టడాలు ఉంటే వాటిపై చర్యలు తప్పని కమిషనర్ హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ 3, ఆప్కాస్ 3, ఇంజనీరింగ్ 11, టిడ్కో హౌసింగ్ 20, రెవెన్యూ 7, టౌన్ ప్లానింగ్ 7, పబ్లిక్ హెల్త్ 4, మొత్తం 55 అర్జీలను కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలన్నిటిని పరిష్కరించాలని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి,మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.