ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల స్వేచ్ఛకు ఆంక్షలా?
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
నివాసం వద్ద పోలీసుల మోహరింపు
నెల్లూరు, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి దర్గామిట్ట సీఐ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని పోలీసులు సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఆయన నివాసం వెలుపల పోలీసులు మోహరించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల కదలికలపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నను మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేవనెత్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ, ప్రజలను కలిసే అవకాశం ఉండాలని ఆయన పేర్కొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సమయంలో పోలీసుల చర్యలు, నోటీసుల వెనుక ఉన్న కారణాలపై సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

.jpeg)