27 ఏళ్ల తర్వాత కడప జెడ్పీ పీఠంపై టీడీపీ పట్టు!
39 జడ్పీటీసీ స్థానాల్లో 23 ఏకగ్రీవం.. పోలింగ్‌కు ముందే కూటమికి మెజారిటీ
కడప, రవి కిరణాలు : కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్ పీఠం తెలుగుదేశం పార్టీ చేతికి దక్కే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ కుటుంబానికి రాజకీయంగా బలమైన పట్టున్న కడప జిల్లాలో గత ఎన్నికల నుంచి మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు జెడ్పీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించాయి.
జిల్లాలోని మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి టీడీపీ ఖాతాలో 23 స్థానాలు ఏకగ్రీవంగా చేరినట్లు సమాచారం. దీంతో పోలింగ్‌కు ముందే కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది.
ఈ పరిణామంతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూటమి ఖాతాలోకి వెళ్లనుంది. ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన జిల్లాలో జెడ్పీ పీఠం విషయంలో చోటుచేసుకున్న ఈ మార్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
