మహిళల భద్రతపై అవగాహన సదస్సు
500 మంది అప్పాచి మహిళా ఉద్యోగులకు పోలీసులు కీలక సూచనలు
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/ తడ:-
మండల పరిధిలోని మాంబట్టు సెజ్ లో వున్న అపాచీ కంపెనీలోని మహిళా ఉద్యోగస్తులకు గురువారం నాయుడుపేట డిఎస్పి జి చెంచుబాబు మరియు సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళా ఉద్యోగులు పాల్గొనడం విశేషం.
సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాలు, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ అవగాహన సదస్సుకు నాయుడుపేట డీఎస్పీ, చెంచుబాబు, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తడ ఎస్ఐ కొండపనాయుడు హాజరై మహిళలకు భద్రతపై పలు సూచనలు చేశారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో స్వీకరిస్తామని తెలిపారు.
పని ప్రదేశాల్లో మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అలాగే అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ సేవల గురించి వివరించారు.
కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు ఆసక్తిగా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మహిళల భద్రత కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
Post a Comment