ఎవరైనా లోన్ తీసుకుంటుంటే ష్యూరిటీగా ఉంటున్నారా..
ఎవరైనా లోన్ తీసుకుంటుంటే ష్యూరిటీగా ఉంటున్నారా.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
అప్పు తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఉన్నవారికి బాధ్యత ఉంటుందని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. రుణ గ్రహీత చెల్లించకుంటే ష్యూరిటీ ఇచ్చిన వారిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని.. రుణం పొందిన వ్యక్తిపైనే తొలుత చర్యలు తీసుకోవాలన్న నిబంధనేమీ లేదని హైకోర్టు తెలిపింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసులో కీలక ఆదేవశాలు ఇచ్చింది.
చిట్‌ఫండ్ సంస్థల నుంచి రుణం తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. రుణం వసూలు చేసే సమయంలో ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని.. రుణం తీసుకున్న వ్యక్తి నుంచి బకాయిలు రికవరీ చేసుకోకుండా.. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతాన్ని ఎటాచ్ చేసే అధికారం చిట్‌ఫండ్ సంస్థలకు ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది. చిట్‌కు సంబంధించిన చట్టంలో రుణం తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీ తర్వాతే ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలనే నిబంధన లేదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి వల్లే డబ్బులు డ్రా చేసుకుంటారని.. అందుకే రుణం తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుందని తెలిపింది. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జాయింట్ రిజిస్ట్రార్ చిట్ ఫండ్ చట్టంలోని రిజిస్ట్రార్ నిర్వచనం కింద వస్తారని కోర్టు తెలిపింది. రికవరీ సర్టిఫికెట్ జారీచేసే అధికారం వారికి ఉందని.. వారిచ్చే సర్టిఫికెట్ చెల్లబాటు అవుతందున్నారు.. సివిల్ కోర్టు డిక్రీతో సమానమన్నారు.
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కంబాల వెంకట రామారావు ఓ వ్యక్తి కపిల్ చిట్ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్‌లో చిట్టీ (రుణం) విషయంలో ష్యూరిటీ ఉన్నారు. చిట్టీ తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించకుండా బాకీ పడటంతో ష్యూరిటీ ఉన్న రామారావుకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ రికవరీ సర్టిఫికెట్ జారీ చేశారు. 2025లో గుంటూరు జూనియర్ సివిల్ కోర్టు రామారావు శాలరీని జప్తు చేస్తూ వారెంట్ ఇచ్చింది. రామారావు ఈ వారెంట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. చిట్టీ తీసుకున్న వ్యక్తి ఆర్థికంగా బాగానే ఉన్నారని.. ఆయన ఆ డబ్బులు చెల్లించ పరిస్థితుల్లో ఉన్నారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. 'చిట్టీ తీసుకున్న వ్యక్తి అందుబాటులో ఉన్నా రికవరీకి చర్యలు తీసుకోకుండా ష్యూరిటీ ఇచ్చిన నాపై నేరుగా రికవరీ చర్యలు ప్రారంభించడం చట్టవిరుద్ధం. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 71, ఏపీ చిట్‌ఫండ్ రూల్స్‌లోని రూల్ 55 ప్రకారం రికవరీ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం చిట్ రిజిస్ట్రార్‌కు మాత్రమే ఉంటుంది.. డిప్యూటీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదు. రికవరీ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి' అని కోరారు.
ఎవరైనా రుణం తీసుకుంటే.. ష్యూరిటీ ఇచ్చిన వారికి కూడా సమానంగా బాధ్యత ఉంటుందని చిట్‌ఫండ్ సంస్థ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. రికరీ సర్టిఫికెట్ జారీచేసే అధికారం డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఉందన్నారు.. చిట్ ఫండ్ చట్టంలోని అంశాలను ప్రస్తావించారు. గుంటూరు కోర్టు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతం జప్తు చేస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన వారెంట్ సరైనదేనన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రామారావు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టేసింది. ఏపీ హైకోర్టు తాజా తీర్పుతో ఎవరైనా రుణం తీసుకుంటే ష్యూరిటీ ఇచ్చే ముందు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
Post a Comment