ఏపీలో స్కూల్ విద్యార్థులకు కొత్త విధానం.. స్టూడెంట్ రిలీవ్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టింది. స్కూళ్లలో మౌలిక సదుపాయాల దగ్గర నుంచి పరీక్షా విధానం వరకు అవసరమైన మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు వేరే స్కూల్‌లో చేరాలంటే అవసరమైన పత్రాలను తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను గుర్తించిన విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం కొత్తగా ఎస్‌ఆర్‌ఆర్‌ఎం (స్టూడెంట్ రిలీవ్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్) విధానంలో బదిలీ ప్రక్రియను చేపడుతున్నారు.
ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి విద్యార్థి వేరే స్కూల్‌కు బదిలీ (ట్రాన్స్‌ఫర్) కావాలనుకుంటే.. ప్రస్తుతం చదువుతున్న ప్రైవేటు స్కూల్ ఫీజు బకాయి ఉంటే మొత్తం ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పరిష్కారంగా.. స్కూల్ ఫీజులు బకాయి ఉంటే 50 శాతం వెంటనే చెల్లించాలని తెలియజేసింది. మిగిలిన ఫీజును ఆరు వాయిదాల్లో స్కూల్‌కు చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విద్యార్థి ఆ స్కూల్ నుంచి బదిలీ అయ్యేందుకు ఎస్‌ఆర్‌ఆర్‌ఎం పేరిట విద్యార్థిని రిలీవ్ చేసేందుకు రిక్వెస్ట్‌తో పాటుగా తల్లిదండ్రుల డిక్లరేషన్ ప్రస్తుతం చదువుతున్న స్కూల్‌లో అందజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు పరిశీలించి టీసీ లేదా రికార్డుషీట్ వెంటనే జారీ చేస్తారు.. అనంతరం ఆ విద్యార్థి పేరు డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేస్తారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానంతో ప్రభుత్వ స్కూళ్లలో కూడా అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ స్కూ్ల్ నుంచి రిలీవ్ అయిన విద్యార్థి వెంటనే యూడైస్ ప్లస్ యాప్‌లో పేరును చేర్చేందుకు అవకాశం ఉంటుంది. స్కూల్ హెడ్‌మాస్టర్, ఎంఈవో దగ్గరకు వెళ్లి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హెడ్‌మాస్టర్ అజాగ్రత్తగా ఉంటే విద్యార్థి పేరు డ్రాప్‌బాక్స్‌లో శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. సీఆర్‌ఎంటీలకు తల్లిదండ్రుల డిక్లరేషన్ పత్రాలు ఇచ్చి.. అనంతరం వాటిని స్కూల్ హెడ్‌మాస్టర్లకు అందజేసి వారి సంతకాలతో ఎమ్మార్సీ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
Post a Comment