నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు
ఒక్కరోజే రూ.7.59 కోట్ల పనులకు శ్రీకారం
రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలి : మంత్రి నారాయణ
52వ డివిజన్ రంగనాయకులపేట పెద్దమసీదు సెంటర్‌లో రూ.39 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డి కాలనీలో రూ.1.70 కోట్లతో డివైడర్, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని ఎండ్‌టు ఎండ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, శంకుస్థాపన చేసిన పనులన్నీ రెండు నెలల్లో పూర్తయ్యేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
గ్రీనరీ.. పార్కులు.. క్రీడా వసతులు
53వ డివిజన్ వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ కింద రూ.4 కోట్లతో చేపట్టనున్న గ్రీనరీ, బ్యూటిఫికేషన్ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అక్కడ షటిల్ కోర్టు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గాంధీగిరిజన కాలనీలో రూ.1.50 కోట్లతో నూతన పార్కు పనులను ప్రారంభించారు. ముత్తుకూరుగేట్ సెంటర్‌లో ఆనం వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఫౌంటైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆలయానికి రూ.5 లక్షల విరాళం
జనార్దన్‌రెడ్డి కాలనీలో నిర్మిస్తున్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి మంత్రి నారాయణ రూ.5 లక్షల విరాళం అందజేశారు. అడగకుండానే విరాళం అందించినందుకు ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అక్టోబర్ 2న స్టేడియం పనులకు భూమిపూజ
నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలలో అధునాతన స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబర్ 2న భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామని, మూడు విడతల్లో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం వీఆర్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నగర అభివృద్ధికి రూ.240 కోట్లు
నెల్లూరు నగర అభివృద్ధికి మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి రూ.240 కోట్లు మంజూరు చేయించారని, నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నగరంలో తొలి స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి మంత్రి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మేయర్ దేవరకొండ సుజాత, ప్రిన్సిపాల్ రామారావు, అదనపు కమిషనర్ హిమబిందు, కార్పొరేషన్ ఎస్‌ఈ రహమత్ జానీ, ఈఈ చంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, ఆయా డివిజన్ల టీడీపీ నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
.jpeg)

Post a Comment