ఉదయగిరిలో ఘనంగా ‘పల్లె పండుగ 3.0’
ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రూ.11,085 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉదయగిరి, రవి కిరణాలు :
ఉదయగిరి నియోజకవర్గంలోని కాకొల్లువారిపాలెంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎం కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా వేదికపైకి చేరుకోగానే సభికులు అపూర్వ స్వాగతం పలికారు. తమ మెడల్లో వేసుకున్న కండువాలను గాల్లో ఊపుతూ నాయకులకు అభివాదం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజలకు అభివాదం చేశారు.
నాయకులను చూసిన ఆనందంతో పలువురు మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ర్యాంప్‌పై సీఎం, డిప్యూటీ సీఎం నడుస్తున్న సమయంలో సభికులు తమ కుర్చీల నుంచి లేచి ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో సభా ప్రాంగణం సందడిగా మారింది.
‘పల్లె పండుగ 3.0’ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిని వివరిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే వీడియో ప్రజంటేషన్‌ను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, రామా నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులతో పనులు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా నాయకులు వివరించారు.



.jpeg)


.jpeg)

.jpeg)

Post a Comment