ఆపరేషన్ సింధూర్: భారతదేశ వ్యూహాత్మక వైఖరిని పునర్నిర్వచించిన సంకల్పం

 ఆపరేషన్ సింధూర్: భారతదేశ వ్యూహాత్మక వైఖరిని పునర్నిర్వచించిన సంకల్పం

'ఆపరేషన్ సింధూర్' వార్షికోత్సవం గుర్తుంచుకోవాల్సిన తేదీ మాత్రమే కాదు; భారత వ్యూహాత్మక దృక్పథంలో వచ్చిన బలమైన, నిర్ణయాత్మకమైన మార్పుకు ప్రతిబింబం. 2026, మే 7న జరిగిన సంఘటనలు కేవలం విజయవంతమైన ఒక సైనిక చర్య మాత్రమే కాదు. అవి రాజకీయ సంకల్పం, సైనిక సన్నద్ధత, సాంకేతిక సామర్థ్యం, జాతీయ పట్టుదలల కలయికను చాటిచెప్పాయి. అనేక విధాలుగా, సంక్లిష్టమైన, బహుముఖ సవాళ్ల మధ్య భవిష్యత్తులో యుద్ధాలను లేదా సంఘర్షణలను భారత్ ఎలా ఎదుర్కోవాలో చెప్పేందుకు నిర్వచనంగా ఆపరేషన్ సింధూర్ నిలిచిపోతుంది. 

ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం తడబాటు లేని రాజకీయ స్పష్టత. దశాబ్దాలుగా, శత్రువుల రెచ్చగొట్టే చర్యలకు భారత్ స్పందించే తీరు తరచుగా స్వయంగా విధించుకున్న పరిమితులకు లోబడే ఉండేది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన సంయమనాన్ని వీడలేదు, కానీ దానిని మరింత మెరుగుపరిచింది. అవసరమైన మేరకే శక్తిని ఉపయోగిస్తూనే, ఒక ఖచ్చితమైన వ్యూహాత్మక సందేశాన్ని శత్రువుకు పంపగలమని భారత్ నిరూపించింది. అదే సమయంలో, అవసరమైతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే సామర్థ్యం కూడా ఉందని స్పష్టంగా చాటిచెప్పింది.

రాజకీయ నాయకత్వం కేవలం నిర్ణయాత్మక చర్య తీసుకోవాలనే ఉద్దేశాన్ని చూపడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న సైనిక కమాండర్లకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను ఇచ్చే అంతటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించింది. లక్ష్యం పట్ల ఉన్న ఈ స్పష్టత.. వేగం, ఖచ్చితత్వం, సమన్వయంగా మారింది. ఆధునిక సైనిక పోరాటాల విజయానికి ఈ మూడు లక్షణాలే అత్యంత కీలకం. రాజకీయ సంకల్పానికి వ్యవస్థాగత సామర్థ్యం తోడైనప్పుడు అది దేశ బలాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఆపరేషన్ సింధూర్ ఈ అద్భుతమైన సమన్వయానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

అంతే ప్రాముఖ్యత కలిగిన మరొక అంశం, భారతదేశం తన బహు-ముఖ సామర్థ్యాలను అత్యంత సమర్థవంతంగా అనుసంధానించడం. నేటి ఆధునిక యుద్ధం.. భూమి, నీరు, ఆకాశానికే పరిమితం కాలేదు; సైబర్, అంతరిక్షం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కు కూడా విస్తరించింది. ఈ విభిన్న రంగాల్లో తన పట్టును ప్రదర్శించడంలో దేశానికున్న ప్రావీణ్యాన్ని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఖచ్చితమైన దాడులతో పాటు శత్రువుల సమాచార వ్యవస్థ, సరఫరా గొలుసును దెబ్బతీసే సైబర్ ఆపరేషన్లు తోడయ్యాయి. ఎప్పటికప్పుడు నిఘా, లక్ష్యాలను గుర్తించడంలో అంతరిక్ష వనరులు కీలక పాత్ర పోషించాయి. లక్ష్యాల్ని గుర్తించడంతో పాటు దాడి తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ క్రియాశీలకంగా పని చేశాయి. అదే సమయంలో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు శత్రువుల స్పందనను బలహీనపరిచాయి. ఈ ఆపరేషన్ భారత దళాల మధ్య కేవలం సమన్వయాన్నే కాదు, సమష్టి పనితీరు, పరిణతిని ప్రతిబింబించింది.

ఈ సమయంలో సివిల్-సైనిక వ్యవస్థల ఏకీకరణ పోషించిన పాత్ర ప్రత్యేకంగా గమనించాలి. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక ప్రయత్నమే కాదు, దేశం మొత్తం కలిసి చేసిన కృషి. నిఘా సంస్థలు, సాంకేతిక సంస్థలు, పౌర నాయకత్వం, సాయుధ దళాలతో కలిసి పనిచేశాయి. నిఘా వ్యవస్థల నుంచి ఖచ్చితమైన ఆయుధాల వరకు స్వదేశీ సాంకేతికతలు కీలక పాత్ర పోషించాయి, ఇది స్వయంసమృద్ధిపై మనం నిరంతరం పెట్టిన పెట్టుబడి ఫలితాన్ని చూపించింది. ఈ ఆపరేషన్ భారత నిర్ణయాధికార నిర్మాణంలోని సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది, ఇక్కడ వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, బ్యూరోక్రాటిక్ జాప్యాలకు తావు లేకుండా ఒకే లక్ష్యంతో సాగింది.

ఆపరేషన్ ప్రారంభానికి ముందే భారతదేశం ఎంతో దూరదృష్టితో వ్యవహరించింది. మనం తీసుకునే చర్యలను ప్రపంచం ఏ విధంగా చూస్తుందనే విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మన దౌత్యవేత్తలు ప్రపంచ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, భారత్ చేస్తున్న ఈ పోరాటం ఎవరినో ఆక్రమించుకోవడానికి కాదని, శత్రువుల రెచ్చగొట్టే చర్యలకు సమాధానంగా చేస్తున్న 'అవసరమైన ఆత్మరక్షణ' అని స్పష్టంగా వివరించారు. దీనివల్ల అంతర్జాతీయ సమాజం కూడా భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని గుర్తించింది. ఇలా సైనిక శక్తికి, రాజకీయ నేర్పు, దౌత్యనీతి తోడవ్వడం వల్లే ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రక విజయంగా నిలిచింది. 

దీనికి భిన్నంగా, పాకిస్థాన్ స్పందన ముందే ఊహించినట్లుగా సాగింది. సైనిక పరంగా చూస్తే, భారత్ మెరుపుదాడికి ఆ దేశం కంగుతిన్నది. తమ దగ్గర ఉన్న అరకొర వనరులు, సరిపోని యుద్ధ సామర్థ్యం వల్ల భారత్ను సమర్థంగా ఎదుర్కోవడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఇక దౌత్యపరంగా, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని చూసినా.. అనుకున్న ఫలితం సాధించలేదు. అయితే, పాకిస్థాన్ ఎక్కువగా దృష్టి పెట్టింది మాత్రం 'సమాచార యుద్ధం' మీదనే. క్షేత్రస్థాయిలో జరిగిన అసలు విషయాలను దాచిపెట్టడానికి, వారు తెలివిగా అల్లిన ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశారు. కానీ, వారి మాటల్లో నిజాయితీ, పొంతన లేకపోవడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నేటి ఆధునిక కాలంలో సమాచారం వెనువెంటనే అందుబాటులోకి వస్తుంది కాబట్టి, పాకిస్థాన్ అల్లిన అబద్ధపు కథనాలు ప్రపంచం ముందు త్వరగానే బట్టబయలయ్యాయి.

ఈ తప్పుడు ప్రచారాన్ని ఎంతో స్పష్టతతో, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టడం చాలా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం కావాలని చేసిన దురాక్రమణ కాదు.. శత్రువుల ప్రత్యక్ష రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చిన సరైన సమాధానం. ఈ ఆపరేషన్ లక్ష్యాలు చాలా స్పష్టమైనవి, ఎంచుకున్న స్థావరాలు చట్టబద్ధమైనవి, దీనిని అత్యంత క్రమశిక్షణతో నిర్వహించారు. భారతదేశం ఎప్పుడూ హద్దులు దాటలేదు; అవసరమైన మేరకు మాత్రమే స్పందిస్తూ, అత్యంత సంయమనంతో వ్యవహరించింది. ఆపరేషన్ జరిగినంత కాలం భారత్ నిజమైన సమాచారాన్ని మాత్రమే వెల్లడించింది. ఎంతో పారదర్శకతను పాటిస్తూ, విశ్వసనీయమైన మార్గాల ద్వారా అసలు విషయాలను ప్రపంచానికి తెలియజేయడం వల్ల, వాస్తవాలను వక్రీకరించే శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

ఆపరేషన్ సింధూర్ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే కొన్ని విలువైన పాఠాలను నేర్పింది. మొదటిది, రాజకీయ సంకల్పం అత్యంత కీలకం. మనం ఏ విషయంలోనైనా అస్పష్టంగా ఉంటే అది శత్రువులకు బలాన్నిస్తుంది, అదే స్పష్టమైన వైఖరితో ఉంటే వారు భయపడతారు. రెండోది, యుద్ధతంత్రంలో కేవలం సైన్యమే కాదు, సైబర్, అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక రంగాల్లో కూడా మనం పట్టు సాధించాలి. భవిష్యత్తులో మన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరం. మూడవది, దేశంలోని పౌర, సైనిక వ్యవస్థలు మరింతగా కలిసి పనిచేయాలి. జాతీయ శక్తిని ఒక పద్ధతి ప్రకారం సమన్వయం చేసుకున్నప్పుడే మనం ఏ సవాలునైనా సమర్థంగా ఎదుర్కోగలం.

మరొక ముఖ్యమైన పాఠం సమాచార యుద్ధతంత్ర రంగంలో ఉంది. ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను ప్రభావితం చేసే ఈ పోరాటం నిరంతరంగా, ఎటువంటి సరిహద్దులు లేకుండా సాగుతూనే ఉంటుంది. తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, దానిని తిప్పికొట్టడానికి, అది వ్యాప్తి చెందక ముందే అడ్డుకోవడానికి భారతదేశం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలి. దీనికోసం కేవలం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉంటే సరిపోదు; వేగవంతమైన, నమ్మదగ్గ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే బలమైన వ్యవస్థలు కూడా ఉండాలి. యుద్ధ క్షేత్రంలో విజయం సాధించడమే కాదు, ప్రపంచం ముందు సరైన వాస్తవాలను నిలబెట్టి మన వాదనను గెలిపించుకోవడమనేది వ్యూహాత్మక విజయానికి అత్యంత కీలకం.

ఆపరేషన్ సింధూర్ రక్షణ రంగంలో స్వయంసమృద్ధి ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. మన దేశంలోనే తయారైన యుద్ధ వ్యవస్థలు తమ సత్తాను నిరూపించుకున్నాయి. దీనివల్ల ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, మన నిర్ణయాలు మనమే తీసుకునే స్వేచ్ఛ పెరిగింది. పరిశోధన, అభివృద్ధి, సరికొత్త ఆవిష్కరణలలో నిరంతరం పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ వేగాన్ని మనం కొనసాగించగలం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా పనిచేయడం అత్యంత కీలకం. ఇలాంటి సమన్వయం ఉన్నప్పుడే రక్షణ రంగంలో భారత్ మరింత శక్తివంతంగా మారుతుంది.


చివరగా, అస్థిరమైన భద్రతా వాతావరణంలో మనం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలనే అవసరాన్ని ఈ ఆపరేషన్ గుర్తు చేస్తుంది. శత్రువును నియంత్రించడమనేది ఒకేచోట ఆగిపోయే అంశం కాదు; మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను, దృఢ నిశ్చయాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే దానిని బలోపేతం చేయాలి. ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. అయితే, ఈ స్థాయిని భవిష్యత్తులోనూ కొనసాగించాలంటే నిరంతర కృషి అవసరం. దీనికోసం సైనిక శిక్షణను మెరుగుపరచడం, యుద్ధ తంత్రాలను ఆధునీకరించడం, మారుతున్న కాలానికి అనుగుణంగా మన రక్షణ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగాలి.

భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ఈ ఆపరేషన్ అందించిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఒక బలమైన వ్యూహాత్మక ప్రకటన. తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన సామర్థ్యం, ఆ పనిని నిర్ణయాత్మకంగా పూర్తి చేయగల సంకల్పం.. రెండూ భారతదేశానికి ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది. 'నియంత్రణ' పాటించడం అనేది ఒక ఎంపిక మాత్రమే తప్ప, అది బలహీనత వల్ల వచ్చిన తప్పనిసరి పరిస్థితి కాదని ఈ ఆపరేషన్ ద్వారా నిరూపితమైంది. అంటే, భారత్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ, అవసరమైతే కఠినంగా స్పందించడానికి వెనుకాడదని స్పష్టమైంది.

రాబోయే కాలంలో, 'ఆపరేషన్ సింధూర్' ఒక అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది. బలమైన రాజకీయ నాయకత్వం, జాతీయ సమైక్యత అండగా ఉంటే, మల్టీ-డొమైన్ ఆపరేషన్లను ఎంత సమర్థవంతంగా నిర్వహించవచ్చో ప్రపంచానికి తెలియజేసే పాఠమిది. ఈ ఆపరేషన్ భారత్ పట్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న అంచనాలను పూర్తిగా మార్చివేసింది. అన్నిటికంటే ముఖ్యంగా, ఇది ఒక శక్తివంతమైన సూత్రాన్ని మరోసారి స్థిరపరిచింది: జాతీయ సంకల్పం, సామర్థ్యం కలిసి పనిచేసినప్పుడు, ఫలితాలేప్పుడూ తిరుగులేని విధంగానే ఉంటాయి.

ఆపరేషన్ సింధూర్ వారసత్వం కేవలం ఆ సమయంలో దక్కిన విజయానికే పరిమితం కాలేదు. అది మనలో నింపిన ఆత్మవిశ్వాసంలో, మన వ్యవస్థలు అంతర్గతంగా నేర్చుకున్న పాఠాలలో, భారతదేశ వ్యూహాత్మక భవిష్యత్తు కోసం అది నిర్దేశించిన దిశలో ఆ వారసత్వం దాగి ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా పరిష్కారం కాని వివాదాలు వివిధ రంగాల్లో, కొత్త రూపాల్లో దేశాన్ని పరీక్షిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, దేశంలోని రాజకీయ, సైనిక, వ్యవస్థాగత యంత్రాంగాలు అన్నీ ఒకే తాటిపై ఉండి, పూర్తి స్పష్టతతో, ఒకే లక్ష్యంతో తమ శక్తినంతా సమన్వయం చేసుకున్నంత కాలం, ఆ ప్రభావం సమతుల్యత ఖచ్చితంగా భారత్ కు అనుకూలంగానే ఉంటుంది. అంటే, మన దేశంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసినంత కాలం, ఎదురయ్యే సవాళ్లపై భారత్ పైచేయి సాధిస్తూనే ఉంటుంది.

 

- Lt Gen Syed Ata Hasnain (Retd)

రచయిత : లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్).  

(బీహార్ రాష్ట్ర గవర్నర్, భారతదేశపు శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే చినార్ కార్ప్స్ మాజీ కమాండర్)

(The writer is Governor, State of Bihar and former Commander of India’s Srinagar based Chinar Corps)

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget