సూళ్లూరుపేట ఇఎస్‌ఐ (ఇ ఎస్ ఐ ) ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం.. కార్మికుల ప్రాణాలతో వైద్యుల చెలగాటం!
ఉదయం 10:30 దాటినా అడ్రస్ లేని డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌ఓ సిబ్బంది
అత్యవసర చికిత్సల కోసం వచ్చి గంటల తరబడి ఆసుపత్రి కారిడార్లలో కార్మికులు, రోగుల నరకయాతన.
కార్మిక చందాల నిధులతో నడుస్తూ సేవల్లో అలసత్వమా? –
తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
తిరుపతి జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన సూళ్లూరుపేట ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్య సేవలపై తీవ్ర నిర్లక్ష్యం బట్టబయలైంది. పరిశ్రమల్లో రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులకు అత్యవసర వైద్యం అందించాల్సిన ఈ ఆసుపత్రిలో గురువారం ఉదయం 10:30 గంటలు దాటినప్పటికీ కనీసం ఒక్క డాక్టర్ గానీ, ల్యాబ్ టెక్నీషియన్, నర్సులు, ఎంఎన్‌ఓ సిబ్బంది గానీ విధులకు హాజరు కాకపోవడం తీవ్ర కలకలం రేపింది. ఉదయాన్నే చికిత్స కోసం, వివిధ పరీక్షల కోసం ఎంతో ఆశతో వచ్చిన వందలాది మంది కార్మికులు, రోగులు ఆసుపత్రి ప్రాంగణంలో సిబ్బంది ఎప్పుడు వస్తారా అని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
ప్రాణాపాయం సంభవిస్తే బాధ్యులెవరు? – కార్మిక సంఘాల ఆగ్రహం
సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా కార్మికులకు గుండెపోటు వంటి అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈఎస్‌ఐ హాస్పిటలే ఏకైక దిక్కు. అలాంటిది, కీలకమైన ఉదయపు వేళల్లోనే సిబ్బంది గైర్హాజరు కావడం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల జీతాల నుండి ప్రతి నెలా ఈఎస్‌ఐ చందాలు కట్ చేస్తున్నప్పటికీ, కనీస బాధ్యత లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసుల కోసం ఆలస్యంగా వస్తున్న ఇలాంటి సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, హాజరు శాతాన్ని మెరుగుపరచాలని కార్మిక సంఘాలు మరియు ప్రజాసంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Post a Comment