వెయ్యేళ్ల సిద్దేశ్వరాలయానికి పూర్వ వైభవం
కృష్ణపట్నం శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వరాలయ పునర్నిర్మాణానికి మంత్రి ఆనం సంకల్పం
చోళుల కాలపు చారిత్రాత్మక ఆలయం అభివృద్ధికి భారీ ప్రణాళికలు
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి ఆనం సమీక్ష
ముత్తుకూరు, ఏప్రిల్ 24 : కృష్ణపట్నంలో దేవతలు నిర్మించిన చారిత్రాత్మక సిద్దేశ్వరాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించిన ఈ ఆలయాన్ని నెల్లూరు జిల్లాకే తలమానికంగా నిలిచేలా పునర్నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఉన్న అత్యంత ప్రాచీన శ్రీ కామాక్షిదేవి సమేత సిద్దేశ్వరాలయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ పురావస్తుశాఖ చీఫ్ మునిరాజారెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా వేద పండితులు, దేవాదాయశాఖ అధికారులు, స్థానిక నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, పునర్నిర్మాణానికి సిద్ధం చేసిన మ్యాపులను కూడా పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాపునర్నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెయ్యేళ్లకు పైగా ఘన చరిత్ర గల ఈ అపురూప ఆలయాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 10, 11వ శతాబ్దాల మధ్య చోళులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రాచీనతకు ఎలాంటి భంగం కలగకుండా, శిల్పకళా నైపుణ్యం చెక్కుచెదరకుండా యథాతథంగా పునర్నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ అధికారులు, దేవాదాయశాఖతో కలిసి అధ్యయనం కొనసాగుతున్నదని చెప్పారు. పూర్వీకులు అందించిన ఈ గొప్ప వారసత్వ సంపదను అత్యంత అపురూపంగా కాపాడుతూ పునర్నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందిస్తామని, సంకల్పబలం, కార్యసిద్ధితో పనులు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయశాఖలో అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి తెలిపారు. ధూపదీప నైవేద్యం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6170 ఆలయాలకు ప్రతినెలా ఒక్కో ఆలయానికి రూ.10వేలు చొప్పున అందిస్తున్నామని, ఈ పథకానికి సంవత్సరానికి రూ.74 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అలాగే 706 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.832 కోట్లతో పనులు చేపట్టామని వెల్లడించారు. టిటిడి ఆర్థిక సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 5వేల పైగా శ్రీవాణి భజన మందిరాలను గ్రామాల్లో నిర్మిస్తున్నామని, రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలతో మూడు విభాగాలుగా మంజూరు చేస్తున్నామని వివరించారు. ప్రతి ఆలయంలో నిత్య పూజాకార్యక్రమాలు జరుగుతూ, భక్తులతో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నామని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మరికొన్ని శతాబ్దాల పాటు సిద్దేశ్వర స్వామి ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లేలా పునర్నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్ తరాలకు ఈ ఆలయ ఖ్యాతిని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కోట్లాది రూపాయలతో ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు కూడా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు.
కేంద్ర పురావస్తుశాఖ చీఫ్ మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కోట్లాది రూపాయలు ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆలయాల ప్రాచీనత దెబ్బతినకుండా పూర్వ వైభవం తీసుకురావడానికి తమ శాఖ కృషి చేస్తున్నదని, ఇప్పటికే సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అలిపిరి ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇదే విధంగా సిద్దేశ్వరాలయాన్ని కూడా ప్రాచీనతను కాపాడుతూ పునర్నిర్మిస్తామని చెప్పారు.
తొలుత సమీపంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు, స్థానిక నేతలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment