అభివృద్ధే ప్రధాన అజెండా మేయర్ స్రవంతి జయవర్ధన్
నెల్లూరు,[కార్పోరేషన్], రవికిరణాలు జూలై 30 :
నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది.
మేయర్ స్రవంతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 111 మెయిన్ అజెండా, 6 సప్లిమెంటరీ అజెండా, 15 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 132 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, అన్ని తీర్మానాలను కౌన్సిల్ సమక్షంలో ఆమోదించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల అజెండాలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సిసి రోడ్లు, సిసి డ్రైన్ కాలువల నిర్మాణం, నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలకు ప్రహరీ గోడల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ పనుల కోసం ప్రైవేట్ ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ట్రిప్పర్లు, స్వీపింగ్ మిషన్ల ఏర్పాటు, డ్రైన్ కాలువల పూడికతీత పనులు, సిల్ట్ ఎత్తివేత పనులు, నగరవ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనం పెంచడం, పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, బారా షహీద్ దర్గాలో అభివృద్ధి పనులు, నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణకు నూతన వాహనాల కొనుగోలుకు, వి.ఆర్ మున్సిపల్ హై స్కూల్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు, వాటి నిర్వహణ పనులు నిమిత్తం సుమారుగా 43 కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించిన అజెండా అంశాలను నెల్లూరు నగర పాలక సంస్థ బడ్జెట్లో కేటాయించామని మేయర్ తెలిపారు.
అదేవిధంగా అమృత్ పథకం 2.0 అభివృద్ధి పనుల కోసం సుమారుగా 101 కోట్ల రూపాయలు కేంద్ర నిధులను కేటాయించామని ప్రకటించారు.
అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్ ఇంతియాజ్, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ వై.ఓ నందన్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post a Comment