ఎన్‌సిసి విద్యార్థులకు శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
బాలల భద్రత, మహిళల రక్షణపై అవగాహన.
పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విద్యార్థులకు సూచనలు.
డ్రగ్స్, టీనేజ్ ఆకర్షణలు, గుర్తుతెలియని లింకులు, వీడియో కాల్స్‌పై అప్రమత్తత.
చదువుపై లక్ష్యసాధన, క్రమశిక్షణ, నైతిక విలువలపై అవగాహన.
తిరుపతి, రవికిరణాలు : తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీమతి ఎం. శ్రీలత గారి ఆధ్వర్యంలో శక్తి బృందం ఎన్‌సిసి నగర్‌లో ఎన్‌సిసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా బాలలపై వేధింపులు, మహిళలపై నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, టీనేజ్ వయస్సులో ఏర్పడే ఆకర్షణలు, సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలు, కేస్ స్టడీలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
విద్యార్థులు చదువుపై లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని, మంచి స్నేహాలు, మంచి అలవాట్లు, నైతిక విలువలను అలవర్చుకోవాలని అదనపు ఎస్పీ శ్రీమతి ఎం. శ్రీలత గారు సూచించారు.

Post a Comment