29వ తేదీన జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయండి--మంత్రి ఆనం
ఆత్మకూరు,రవికిరణాలు:
ఈ నెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు సమాయత్తం కావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
ఆత్మకూరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కోఆర్డినేటర్ కొమ్మలపాటి శ్రీధర్ తో కలిసి ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతో మంత్రి ఆనం ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లు, జనసమీకరణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, కూటమి శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రామాపురంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిచేలా నిర్వహించాలని మంత్రి ఆనం సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. గ్రామాల వారీగా జనసమీకరణ, వాహనాల ఏర్పాటు, ప్రజలను సభా ప్రాంగణానికి తీసుకురావడం, తిరిగి సురక్షితంగా వారి గ్రామాలకు చేర్చడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే రామాపురం సభకు ప్రజలను భారీగా తరలించి లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని మంత్రి ఆనం కోరారు.

Post a Comment