రోడ్డు ప్రమాదాల నివారణకు V2V టెక్నాలజీ.. ప్రతి వాహనంలో అమలు చేస్తాం: నితిన్ గడ్కరీ
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల మధ్య పరస్పర సమాచార మార్పిడికి ఉపయోగపడే వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ టెక్నాలజీని భవిష్యత్తులో ప్రతి వాహనంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన 30 మెగాహెర్ట్జ్ (MHz) ఫ్రీక్వెన్సీని వినియోగించుకునేందుకు టెలికాం శాఖ (DoT) అనుమతి ఇచ్చిందని గడ్కరీ స్పష్టం చేశారు. V2V టెక్నాలజీ ద్వారా వైర్లెస్ విధానంలో రహదారులపై ఉన్న బ్లైండ్ స్పాట్స్, సమీపంలో వస్తున్న ఇతర వాహనాల వేగం, దూరం వంటి వివరాలను డ్రైవర్లకు ముందుగానే హెచ్చరించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకంగా హైవేలు, మలుపులు, దట్టమైన ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Post a Comment