వైసీపీని ముంచిన ఐ ప్యాక్ – మమతా బెనర్జీని గట్టెక్కిస్తుందా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనం తర్వాత ఐ-పాక్ విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా అనుమానాలు బలపడ్డాయి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అనేది కేవలం రాజకీయ ఓటమి మాత్రమే కాదు, ఐ-పాక్ అందించిన డేటా, వ్యూహాల ఘోర వైఫల్యం. ఇప్పుడు అదే సంస్థను పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ గుడ్డిగా నమ్ముతుండటం పట్ల అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
టీఎంసీ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్‌లో లాగే బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పాత తరం నాయకులు , క్షేత్రస్థాయి క్యాడర్ ఐ-పాక్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారిని కాదని, ఐ-పాక్ ఇచ్చే స్క్రీనింగ్ రిపోర్ట్స్ ఆధారంగా టిక్కెట్లు కేటాయించడం, నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించడం వంటివి నేతలకు మింగుడుపడటం లేదు. కంప్యూటర్ల ముందు కూర్చునే కుర్రాళ్లు మాకు రాజకీయం నేర్పిస్తారా అనే భావన క్యాడర్‌లో బలంగా ఉంది. జగన్ విషయంలో కూడా క్షేత్రస్థాయి నాయకుల మాట వినకుండా కేవలం ఐ-పాక్ రిపోర్టులనే నమ్ముకోవడం వల్లే గ్రౌండ్ రియాలిటీకి పార్టీ దూరమైందని, బెంగాల్‌లోనూ అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఐ ప్యాక్ బ్రాండింగ్ వల్ల ప్రజల్లోనూ వ్యతిరేకత
సాధారణ ప్రజలకు ఐ-పాక్ అనేది ఒక ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థగానే తెలుసు. అయితే, ప్రభుత్వం అందించే పథకాల వెనుక ఐ-పాక్ బ్రాండింగ్ ఉండటం వల్ల, ప్రజలు దీనిని ఒక రాజకీయ యంత్రాంగం కంటే పర్యవేక్షణ సంస్థ గా చూస్తున్నారు. జగన్ హయాంలో బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు చేరవేసే వ్యూహాన్ని ఐ-పాక్ విజయవంతంగా మార్కెట్ చేసింది, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను విస్మరించింది. బెంగాల్‌లో కూడా కేవలం సంక్షేమ పథకాల ద్వారానే గెలవొచ్చని ఐ-పాక్ నమ్ముతోంది, కానీ ఏపీ ఫలితాలు చూశాక ప్రజల నాడిని పట్టడంలో డేటా అనలిటిక్స్ ఫెయిల్ అవ్వొచ్చని అక్కడా ప్రచారం జరుగుతోంది.
ఐ-పాక్ గట్టెక్కించగలదా?
జగన్ విషయంలో ఐ-పాక్ విఫలం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించలేకపోవడం. ఐ-పాక్ సర్వేలు ఎప్పుడూ అంతా బాగుంది అనే భ్రమలో జగన్‌ను ఉంచాయి. మమతా బెనర్జీ విషయంలో కూడా ఐ-పాక్ ఇదే ధోరణిని అనుసరిస్తోంది. అయితే మమతకు ఉన్న అతిపెద్ద బలం ఆమె వ్యక్తిగత ప్రజాకర్షణ. జగన్ లాగా ఆమె కేవలం ఏసీ రూముల్లో రిపోర్టులకే పరిమితం కాకుండా, స్వయంగా రోడ్ల మీదకు వస్తారు. తాజాగా ఈడీ దాడుల సమయంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగడం దీనికి నిదర్శనం. ఐ-పాక్ వ్యూహాలు కేవలం సపోర్టింగ్ సిస్టమ్‌గా మాత్రమే పనిచేస్తాయి కానీ, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ సంస్థ కూడా గట్టెక్కించలేదని ఏపీ ఫలితాలు నిరూపించాయి. ఐ-పాక్ తనను తాను ఒక ఓటమి లేని సంస్థగా ప్రచారం చేసుకుంటుంది. కానీ జగన్ పతనం ఆ ట్యాగ్‌ను చెరిపివేసింది. బెంగాల్‌లో టీఎంసీ ఓడిపోతే ఐ ప్యాక్ క్లోజ్ అయిపోయినట్లే.
Post a Comment