పెంచలకోన బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం - వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు
రాపూరు, పెంచలకోన, ఏప్రిల్ 03.
నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాపూరు మండలం నందు పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు తెలిపారు. ఈ రోజు సదరు దేవస్థానం ప్రాంగణంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన ఆలయ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను బ్యాటరీ వాహనంలో తిరిగి పరిశీలించారు.
ఏప్రిల్ 27వ తేదీన గోనుపల్లి నుండి స్వామివారు పెంచలకోనకు చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమై, మే 3వ తేదీ వరకు సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే గారు వివరించారు.
మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. ముఖ్యంగా సులభతరమైన దర్శనం, నాణ్యమైన భోజన సదుపాయం (అన్నదానం), తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు.
గత సంవత్సరం ఉత్సవాల్లో పారిశుద్ధ్య విభాగం అద్భుతంగా పనిచేసిందని సభాముఖంగా అధికారులు ప్రశంసించారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో, మరింత మెరుగ్గా ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు.
పోలీస్, రెవెన్యూ, ఫైర్, అటవీ శాఖ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సీసీ కెమెరాలతో కూడిన ఒక ప్రత్యేక 'కంట్రోల్ రూమ్' ను ఏర్పాటు చేయాలని అధికారులుకు తెలిపారు.
దెబ్బతిన్న రోడ్లు, ప్రహరీ గోడల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత ఆర్ అండ్ బీ (R&B) అధికారులను ఆదేశించారు.
భక్తులతో సిబ్బంది మరియు అధికారులు అత్యంత మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఎవరిపైనా దురుసుగా ప్రవర్తించరాదని ఎమ్మెల్యే గారు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు కోరారు. ఈ సన్నాహక సమావేశంలో ఆర్డీఓ, డీఎస్పీ, దేవస్థానం ఈఓ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.
Post a Comment